28 August, 2026 | 1:51 AM

బీజేపీ ప్రజావ్యతిరేక విధానాలపై సీపీఐ చలో ఢిల్లీ

27-08-2026 02:32 PM

హనుమకొండ,(విజయక్రాంతి): కేంద్ర బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను(BJP anti people policies) నిరసిస్తూ సెప్టెంబర్ 1న సిపిఐ ఛలో డిల్లీ కార్యక్రమం తలపెట్టిందని, ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి తోట బిక్షపతి పిలుపునిచ్చారు. గురువారం హనుమకొండ మండలంలోని గుండ్ల సింగారం సురవరం సుధాకర్ రెడ్డి నగర్ లోని ముఖ్య కార్యకర్తల సమావేశం సిపిఐ మండల సహాయ కార్యదర్శి గుంటీ రాజేందర్ అధ్యక్షతన జరుగగా ముఖ్య అతిథిగా సిపిఐ జిల్లా కార్యదర్శి తోట బిక్షపతి హాజరై మాట్లాడుతూ దేశంలో మార్పు కోసం సిపిఐ పోరాటం సాగిస్తోందని అన్నారు.

బీజేపీ(Bharatiya Janata Party) 12 ఏళ్ల పాలనలో ప్రజలకు ఉపయోగకరమైన ఒక మంచి పని చేయలేక పోయిందని, ధరలను అరికట్టడంలో, ఉద్యోగాల కల్పనలో విఫలమైందని అన్నారు. దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసిందని, సాధారణ పౌరులను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టిందని, రైతాంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యము చేసి కనీస మద్దతు ధరకు చట్టబద్ధమైన హామీ ఇవ్వడంలో విఫలమయ్యారని, రైతు సంక్షేమాన్ని దెబ్బతీశారని, ఉపాధి హామీని నిర్వీర్యం చేశారన్నారు.

కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశంలో ఆగస్టు 6 నుండి 14 వరకు దేశ వ్యాప్తంగా సిపిఐ ప్రచార జాత పాదయాత్ర నిర్వహించడం జరిగిందని, పాదయాత్ర జాతల ద్వారా ప్రతి గ్రామంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ప్రజలకు వివరించడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా సెప్టెంబర్ 1వ తేదీన లక్షలాది మందితో సిపిఐ ఛలో ఢిల్లీ పిలుపునివ్వడం జరిగిందని అన్నారు. సెప్టెంబర్ 1న జరిగే ఛలో డిల్లీ కార్యక్రమంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ హనుమకొండ మండల కార్యదర్శి ఎన్ ఎ స్టాలిన్, నాయకులు పూజారి అమృతయ్య, కోడపాక బాబు, మామునూరి దామోదర్, కేతపాక ప్రసాద్, తాటికంటి మమత, గుంటీ రజిత తదితరులు పాల్గొన్నారు.