టీజీఇజేఎసీ ఆధ్వర్యంలో మహాధర్న
ముకరంపుర, ఆగస్టు27 (విజయక్రాంతి): కరీంనగర్ కలెక్టరేట్ సమీపంలో టీజీఇజెఎసి ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. గురువారం టిఎన్జీవోస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన కార్యక్రమం ఇంచార్జ్ కాలే చరణ్ ఆధ్వర్యంలో దాదాపు 200కు పైగా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఏకమై మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా టిఎన్జీవో అధ్యక్షులు మాట్లాడుతూ ఉద్యోగుల పెండింగ్ బిల్లులు చెల్లించాలని,సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తూ ఓ పి ఎస్ ను తీసుకురావాలని, అలాగే పెండింగ్ డిఎ లు విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు.
ఇప్పటివరకు పిఆర్సి కూడా అమలు చేయడం లేదని, పదివేల కోట్ల ఉద్యోగుల పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలని కోరారు. ఇప్పటివరకు ప్రభుత్వంతో చాలాసార్లు చర్చలు జరపడం అయిందని, వినతి పత్రాలు ఇవ్వడం కూడా జరిగిందని ఇకనుండి ప్రభుత్వంతో ఎలాంటి చర్చలు ఉండవని ఇక మనకు పోరాటమే శరణ్యమని ఉద్యోగ సంఘాలకు పిలుపునిచ్చారు. పదవి విరమణ పొందిన ఉద్యోగుల అవస్థలు అంతా ఇంతా కాదని మనం దాచుకున్న డబ్బులు మనకు ఇవ్వడానికే ప్రభుత్వం ఇబ్బందులు పెడుతుందని, మనకు రావాల్సిన బకాయిలను ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక ,పెన్షనర్ల సంఘాలు అన్ని ఏకత్రాటిపై పోరాటం చేసి సాధించుకుందామని పిలుపునిచ్చారు.






