21 May, 2026 | 4:17 PM

తెల్లవారుతుండగానే పల్లెల్లోకి పాఠశాలల ప్రచారం.. విత్తన కంపెనీల ప్రచార రథాలు

21-05-2026 03:08 PM

బోథ్. మే 21 (విజయక్రాంతి): జూన్ నెలలో పాఠశాలల పునః ప్రారంభంకానుండడంతో వివిధ పాఠశాలలు కళాశాలల యాజమాన్యాల వారు పల్లెలకు ప్రయాణం అవుతున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులను ఆకట్టుకునే విధంగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.. తమ తమ పాఠశాలలో విద్యార్థులను చేర్పించాలంటే ఇంటింటికి తిరుగుతున్నారు. ఎన్నికల ప్రచారాన్ని మైమరిపించే విధంగా విత్తన కంపెనీల వారు తమ ప్రచార రతాలను గ్రామాల్లోకి పంపుతున్నారు. వివిధ కంపెనీల వారు ఈసారి తమ విత్తనాలను వాడాలంటూ రైతులకు వివరిస్తున్నారు.పంట దిగుబడిని వివరిస్తూ తమ కంపెనీ విత్తనాలను వాడాలంటే కోరుతున్నారు... 

పాఠశాలల యాజమాన్యాల వారి తీరే వేరు..... మండలంలోని ఒక పాఠశాల యాజమాన్యం వారు తమ పాఠశాలలో చదవకున్న గురుకుల పాఠశాలలో సీటు సంపాదించిన విద్యార్థుల వారి ఫోటోలతో సహా ప్రచురించి తప్పుడు ప్రచారాలను చేసుకుంటున్నారు. వివిధ కోచింగ్ సెంటర్లలో శిక్షణ తీసుకొని సీట్లు సంపాదించిన వారి పేర్లను వాడుకోవడం అంటే మసిపూసి మారేడు చేసినట్టే అని పలువురు పేర్కొంటున్నారు. లేనిది ఉన్నట్టుగా వారి ప్రచార కరపత్రాలలో ముద్రించి ప్రచారాలు చేస్తుంటే విషయం తెలిసినవారు నవ్వుకుంటున్నారు. తప్పుడు ప్రచారాలతో విద్యార్థులను భర్తీ చేయాలన్న ఆలోచనలో ఉన్నట్టు పలువురు పేర్కొంటున్నారు.