ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలి
తాసిల్దార్ కు వినతి....
సుల్తానాబాద్, మే 21 (విజయ క్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో ధాన్యం మరియు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు ,జిల్లా అధ్యక్షులు కర్రే సంజీవరెడ్డి ఆదేశాల మేరకు సుల్తానాబాద్ మండల అధ్యక్షులు కందుల శ్రీనివాస్ సూచనల మేరకు మండల ప్రధాన కార్యదర్శి కొల్లూరి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో తహసీల్దార్ బషి రుద్దీన్ కి గురువారం వినతి పత్రం సమర్పించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ప్రస్తుతం మండలంలో కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు తీవ్ర ఇబ్బందులుఎదుర్కొంటున్నారని తెలిపారు.
ముఖ్యంగా కొనుగోలు ప్రక్రియలో అధికారులు, మిల్లర్లు కలిసి రైతులను “బి-కేటగిరి” పేరుతో ఇబ్బందులకు గురిచేస్తూ అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు.అలాగే కొనుగోలు కేంద్రాలలో తగిన టార్పాలిన్లు లేకపోవడంతో వర్షాలు వస్తే ధాన్యం తడిసి రైతులు ఆందోళన చెందుతారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు ప్రతి కొనుగోలు కేంద్రంలో అవసరమైన సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.రైతుల పట్ల నిర్లక్ష్య వైఖరి కొనసాగితే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి కామని రాజేందరప్రసాద్, ప్రధాన కార్యదర్శి కోట నాగేశ్వర్, కిసాన్ మోర్చా అధ్యక్షులు మెండే శంకరయ్య, యువ మోర్చా అధ్యక్షులు కొమ్మిడి రాజేందర్ రెడ్డి, మండల ఉపాధ్యక్షులు దాసరి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు..






