calender_icon.png 19 February, 2026 | 3:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాల్క సుమన్‌ను విడుదల చేయాలి

19-02-2026 01:20:44 AM

మాజీ మంత్రి హరీశ్‌రావు

హైదరాబాద్, ఫిబ్రవరి 18 (విజయక్రాంతి): క్యాతనపల్లిలో కాంగ్రెస్ అప్రజాస్వామిక, అహంకార చర్యలను అడ్డుకున్నందుకు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను అరెస్టు చేసి, నిర్బంధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీమంత్రి హరీశ్‌రావు తెలిపారు. క్యాతనపల్లిలో బీఆర్‌ఎస్ పార్టీకి పూర్తి మెజారిటీ వచ్చిన కూడా కాంగ్రెస్ పార్టీ పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని పరిహసించిన తీరు చూసి యావత్ తెలంగాణ అసహ్యించుకుంటున్నదని పేర్కొన్నారు.

ఈ మేరకు ఆయన బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అధికార బలం, పోలీసు బలం, ధన బలంతో చట్టాలను తుంగలో తొక్కడం కాంగ్రెస్ అరాచక వైఖరికి పరాకాష్ట అన్నారు. రాష్ట్రమంతా కాంగ్రెస్ మార్కు గూండాగిరి రాజ్యమేలుతున్నదని, మున్సిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్‌లో మురుగు రాజకీయాల వాసన కమ్ముకున్నదని విమర్శించారు.

హంగ్ వచ్చిన చోటల్లా ప్రతిపక్ష నాయకులను సంత బేరం చేస్తూ, కిడ్నాపులకు తెగబడుతూ ప్రజా తీర్పును కాలరాస్తున్న తీరుకు నిదర్శనాలు ఎన్నో ఉన్నాయని తెలిపారు. బాల్క సుమన్‌ను బేషరతుగా విడుదల చేయాలని, ప్రజాస్వామిక వాతావరణంలో క్యాతనపల్లి చైర్మన్ ఎన్నిక జరిగేలా బాధ్యత వహించాలని ఎన్నికల కమిషన్‌ను డిమాండ్ చేశారు.