18 August, 2026 | 7:05 PM

ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి

18-08-2026 06:28 PM

ఎల్లారెడ్డి,(విజయక్రాంతి): ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని స్నేహ బ్యాంకెట్ హాల్‌లో మంగళవారం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. పీఏసీఎస్ వైస్ చైర్మన్ ప్రశాంత్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు గౌడ సంఘం నాయకులు, కార్యకర్తలు పాల్గొని సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ప్రశాంత్ గౌడ్ మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కేవలం గౌడల కోసం మాత్రమే పోరాడిన నాయకుడు కాదని, అణగారిన బహుజన వర్గాల హక్కుల కోసం పోరాడిన మహావీరుడని అన్నారు. సాధారణ గీత కార్మిక కుటుంబంలో జన్మించిన పాపన్న గౌడ్, 12 మంది స్నేహితులతో తన పోరాటాన్ని ప్రారంభించి, అనంతరం 12 వేల మందితో సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారని తెలిపారు.

అణగారిన వర్గాల ఆత్మగౌరవం కోసం పోరాడిన పాపన్న గౌడ్ తన పరాక్రమంతో గోల్కొండ కోటను స్వాధీనం చేసుకుని పాలించిన మహావీరుడిగా చరిత్రలో నిలిచారని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను నేటి యువత ఆదర్శంగా తీసుకుని సమాజ అభ్యున్నతికి కృషి చేయాలని ప్రశాంత్ గౌడ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు, సభ్యులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.