ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఇసుక టిప్పర్
20 మందికి ప్రయాణికులకు స్వల్ప గాయాలు
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు
నిజామాబాద్ జిల్లా వర్నిలో చోటు చేసుకున్న ఘటన
బాన్సువాడ,(విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా వర్ని మండల కేంద్రంలోని జాకోర చౌరస్తా వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులను ఎక్కించుకునేందుకు ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును వెనుక నుంచి వేగంగా వచ్చిన ఇసుక టిప్పర్ లారీ బలంగా ఢీకొట్టింది. ప్రమాద ధాటికి బస్సు ముందు భాగం, టిప్పర్ క్యాబిన్ తీవ్రంగా దెబ్బతిన్నాయి. బస్సులో ఉన్న 20 మంది ప్రయాణికులు ఒక్కసారిగా కుదుపునకు గురై చేతులు, కాళ్లు, తలకు స్వల్ప గాయాలయ్యాయి.
టిప్పర్ డ్రైవర్ కూడా గాయపడినట్లు సమాచారం. స్థానికులు వెంటనే స్పందించి బస్సులో చిక్కుకున్న ప్రయాణికులను బయటకు తీసి, వర్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు అందరికీ ప్రథమ చికిత్స అందించారు. అదృష్టవశాత్తు ఎవరికీ తీవ్ర గాయాలు కాలేదని వైద్యులు తెలిపారు.వర్ని పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని ప్రమాదానికి గురైన వాహనాలను పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమిక విచారణలో తేలింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






