7 May, 2026 | 2:10 AM

కృష్ణానదీ తీరంలో ఇసుక దొంగలు!

07-05-2026 01:10 AM

ఇంటిగ్రేటెడ్ స్కూల్ పేరుతో అక్రమ ఇసుక దందా

ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు

పెంట్లవెల్లి మే 6: నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం పెంట్లవెల్లి మండలం జటప్రోలు గ్రామ పరిసరాల్లోని కృష్ణానది తీర ప్రాంతంలో ఇసుక దొంగలు తమ ప్రతాపాన్ని చూపుతున్నారు. కొంతమంది అక్రమార్కులు గ్రామ సమీపంలో రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం పేరుతో అక్రమంగా కృష్ణానది తీర పరిసరాల్లో భారీగా గోతులు తవ్వి ఇసుక వ్యాపారం సాగిస్తున్నారు. నిశ్శబ్దంగా ఉండాల్సిన కృష్ణ తీర ప్రాంతం ఇప్పుడు అక్రమ ఇసుక తవ్వకాలతో ఆ ప్రాంత వాసులను కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.

రాత్రి వేళల్లో జేసీబీల శబ్దాలు వినిపిస్తున్నాయి. అనుమతులు లేకుండానే నది లోతుల్లోకి దిగిపోయి సుమారు 20 అడుగుల లోతులో ఇసుకను తవ్వి కుప్పలు వేస్తున్నారు. ఆ ఇసుకను ట్రాక్టర్లలో ఎక్కించి పక్క ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ అక్రమ దందా చూసి గ్రామస్తులు ఆగ్రహంతో రగిలిపోయారు. ఇలా కొనసాగితే మా భూముల్లో నీరు ఉండదంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా నిరంతరం ఇసుక తరలింపు జరుగుతోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఒక్కో ట్రిప్ను 5 నుంచి 6 వేలకు అమ్ముతున్న పరిస్థితి ఏర్పడింది. అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ పేరుతో వేల సంఖ్యలో ఇసుక ట్రిప్పులు తరలిస్తూ భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసులు, రెవెన్యూ, మైనింగ్ అధికారులు స్పందించకపోవడం వెనుక పెద్దల హస్తం దాగి ఉందా అనే అనుమానాలు గ్రామంలో చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటికైనా ఉన్నత స్థాయి అధికారులు స్పందించి అక్రమంగా కృష్ణ తీరప్రాంతంలో ఇసుక దోపిడీని అరికట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.