కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ ద్వితీయ వర్ధంతి సభ
బోధన్,(విజయక్రాంతి): కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ ద్వితీయ వర్ధంతి సందర్భంగా అఖిల భారత ఐక్య రైతు సంఘం ఎడపల్లి మండల కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు గుమ్ముల గంగాధర్ పుట్టి, నడిపి నాగన్న మాట్లాడుతూ... కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా సమాజంలో బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం నిరంతరం పోరాటం చేసిన గొప్ప ప్రజానాయకుడని కొనియాడారు. పోడు భూముల సమస్య పరిష్కారం కోసం గిరిజన గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి, గిరిజనులను ఏకం చేసి భూ పోరాటాలు నడిపిన నాయకుడిగా ఆయన సేవలను గుర్తు చేశారు.
రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేయాలని నిరంతరం ఉద్యమించారని తెలిపారు. కోవిడ్ సమయంలో ఢిల్లీ సరిహద్దుల్లో జరిగిన రైతుల ఉద్యమంలో పాల్గొని రైతాంగ హక్కుల కోసం తన వంతు పాత్ర పోషించారని గుర్తుచేశారు. కామ్రేడ్ చంద్రశేఖర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ, ఆయన చూపిన మార్గంలో నడవాలని రైతాంగానికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎడపల్లి మండల నాయకులు కాశ రవి, సిపతి మల్లేష్, సిద్ధ పోశెట్టి, కొండ్ర భూమన్న, ఇందూర్ శంకర్, లక్ష్మణ్, గంగారం తదితరులు పాల్గొన్నారు.






