29 March, 2026 | 1:43 AM

సళేశ్వరం.. సాహసయాత్ర

29-03-2026 12:00 AM

‘లింగమయ్య’ పూజరులు చెంచులు

దక్షిణ భారతంలో దట్టమైన అటవీ ప్రాంతం అంటే గుర్తు కు వచ్చేది నల్లమల్ల అటవీ ప్రాంతం. దట్టమైన అడవి, ఎత్తున కొండలు, రింగు రింగుల రహదారులు, పక్షుల కిలకిల రాగా లు, సెలయేటి చప్పుళ్లు, ఆప్యాయంగా పలకరించే అడవి బిడ్డలు.. క్రూర మృగాలు.. నల్లమల అడవి పొదలో పదిలంగా ఉన్నాయి.

అలాంటి అటవీ ప్రాంతంలో కొలువైన లింగమయ్య దర్శనం చేసుకోవాలంటే చైత్ర పౌర్ణమి నుంచి మూడు రోజులు మాత్రమే భక్తులకు అనుమతి ఉంటుంది. మరో అమరనాథ్‌గా పిలువబడుతున్న సళేశ్వరం యాత్ర భక్తులకు సాహసయాత్రగా పిలుస్తారు. మానవ జీవిత చక్రం కళ్ళ ముందు కనిపించేలా పసిపిల్లల నుంచి పండు ముసలి వరకు లింగమయ్య దర్శనం కోసం సాహస యాత్రలో నిమగ్నమవుతారు.

శ్రీశైలం వెళ్లే దారిలో ఫరహాబాద్ నుంచి దట్టమైన అటవీ ప్రాంతంలోకి అక్కడి నుంచి చెంచు గూడెంలో ఎత్తున లోయలోకి కాలినడకన వెళ్లాలంటే సాహస యాత్రే. క్రూర మృగాలు సంచరించే ఆ ప్రాంతంలో కేవలం మూ డు రోజులు మాత్రమే దర్శనానికి అనుమతి ఉండటంతో లింగమయ్య దర్శనం కోసం కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఆంధ్ర ప్రదేశ్‌తోపాటు ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణ ప్రాంతంలోని అమ్రాబాద్ అటవీ పరిధిలోని సలేశ్వరం లింగమయ్య దర్శనం కోసం క్యూ కడుతున్నారు.

లింగమయ్య దైవ దర్శనం కోసం అక్కడి చెంచులే పూజారులుగా పూజలు అందిస్తున్నారు. ఏప్రిల్ ఒకటి నుంచి మూడు రోజులపాటు జరిగే ఈ సాహస యాత్రకు భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా అటవీ శాఖ పోలీస్ రెవెన్యూ వైద్య ఆరోగ్యశాఖ సంయుక్తంగా కలెక్టర్ బాదావత్ సంతోష్ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లను చేశారు.

దక్షిణాది అమరనాథ్.. సళేశ్వరం 

హిమాలయాల్లోని అమరనాథ్ యాత్రలా, నల్లమల్లలోని సళేశ్వరం కూడా భక్తులకు దివ్యానుభూతిని అందిస్తుంది. కఠినమైన మార్గం, ప్రకృతి మధ్యలో ఉన్న శివక్షేత్రం, ప్రత్యేక పూజా విధానాలు ఈ యాత్రను దక్షిణాది అమరనాథ్‌గా పిలువబడుతుంది.   

ఈ క్షేత్రానికి ప్రత్యేకత ఏమిటంటే, ఇక్కడి పూజా కార్యక్రమాలు చెంచు గిరిజనుల చేత జరుగుతాయి. శివయ్యను తమ కుటుంబ దేవుడిగా భావించే చెంచులు, సంప్రదాయ పద్ధతుల్లో పూజలు నిర్వహిస్తారు. వారి ఆచారాలు, భక్తి, సాంప్రదాయ జీవన విధానం ఈ యాత్రకు ప్రత్యేక ఆకర్షణ. ప్రతి ఏడాది చైత్ర పౌర్ణమి రోజు నుంచి మూడు రోజులు మాత్రమే భక్తులకు శివయ్య దర్శనం ఇస్తాడు.

పండు వెన్నెలలో దట్టమైన అటవీ ప్రాంతం లో ఈ సాహ స యాత్ర భక్తులకు మంచి అనుభావాన్ని ఇస్తుంది. ఈ సాహస యాత్రలో భక్తులు శివయ్య దర్శనానికి వెళ్లే సమయంలో ముక్త కంఠంతో ‘వస్తున్నాం లింగమయ్య’ అం టూ నడక ప్రారంభించి దర్శనం చేసుకున్న తరువాత తిరిగి కొండపైకి ఎక్కే సమయంలో ‘మళ్లొస్తాం లింగమయ్య’ అనే నామస్మరణతో నల్లమల్ల అడవి మొత్తం మారు మోగుతోంది. చేత్ర పౌర్ణమి రోజు సళేశ్వరం యాత్ర ప్రారంభం రోజు వర్షం రావడం లింగమయ్యకు గంగమ్మ వర్షాభిషేకం జరుగుతుందని ఇక్కడి ఆచారం.