33వ సామూహిక వివాహాలు
నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భారం తగ్గించాలనే ఆలోచనతో అదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం దస్నాపూర్ గ్రామంలో 33వ సామూహిక వివాహాలు జరిపించేందుకు ఏర్పా ట్లు చేస్తున్నారు. ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు.. సామెత ప్రకా రం రెండూ భారీ ఖర్చుతో కూడుకున్నవే. పెండ్లి ఖర్చులు తగ్గించడంతోపాటు ఆంద్ ఆదివాసి గిరిజన తెగ సంస్కృతి సాంప్రదా యాలకు అనుగుణంగా వివాహాలను జరిపిస్తూ దస్నాపూర్ గ్రామం ఆదర్శంగా నిలుస్తున్నది. గత కొన్నేళ్లుగా ప్రతి ఏడాది ఏప్రిల్ నెలలో మంచి ముహూర్తం రోజున పెళ్లి చేసే జంటలను గుర్తించి ఒకే వేదికపై సామూహికంగా పెళ్లిళ్లు జరిపిస్తున్నారు.
ఈ పెళ్లిళ్లలో మరో విశేషం ఉంది. సాధారణంగా ఆడపిల్ల తల్లిదండ్రులకు పెండ్లి అనేది భారంగా ఉంటుంది. కానీ సామూహిక వివాహా ల్లో వరుడు తరఫు కుటుంబం వాళ్లు రూ.30 వేలు నిర్వాహకులకు చెల్లించాల్సి ఉం టుంది. ఇందులో తిరిగి 12 వేల విలువైన బట్టలను పెళ్ళికొడుకు కూతురికి పెట్టి, మిగతా 18 వేలతో పెండ్లికి హాజరయ్యే బంధువులకు భోజన ఖర్చులు చేస్తారు.
32 ఏళ్లు.. 518 జంటలు
దస్నాపూర్ గ్రామంలో 1993 ఏప్రిల్ నెలలో సామూహిక వివాహ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచి ఏప్రిల్ 2025 వరకు 518 జంటలకు సామూహిక వివాహాలు నిర్వహించారు. అంద్ ఆదివాసీ గిరిజన తెగకు చెందిన యువతి యువకుల ను గ్రామాల్లో గుర్తించి వారి వివాహ కార్యక్రమానికి సిద్ధం చేస్తా రు.
పెళ్లీడు వచ్చిన యువతీ, యువకుల ఆధార్ కార్డుతోపాటు వారి చదువు, వయస్సును గుర్తించి సామూహిక వివాహానికి అర్హులుగా గుర్తించి వారి పెళ్లికి అంగీకారం తెలుపుతామని గ్రామ పటేల్ పుండలిక్ తెలిపారు.
మహారాష్ట్రలో చూసి.. ఇక్కడ అమలు చేసి
మహారాష్ట్రలోని కిన్వాట్ తాలూకాలో అంద్ ఆదివాసి గిరిజను లు 1992 సామూహిక వివాహాలను ఏర్పాటు చేశారు. పెండ్లిలకు వెళ్లిన బలిరాం గురూజీ ఆ కార్యక్రమాన్ని గుర్తించి తన గ్రామంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారని గ్రామ పటేల్ పుండలిక్, అంద్ ఆదివాసి సేవా సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి మారుతి తెలిపారు. 1993 నుంచి ప్రతి ఏడాది సామూహిక వివాహాలను నిర్వహిస్తున్నామని వారు తెలిపారు.
1996లో సామూహిక వివాహాలకు అప్పటి కేంద్ర మంత్రి డాక్టర్ వేణుగోపాల చారి, రాష్ట్ర మంత్రి జి నగేష్‌తోపాటు ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, అప్పటి కలెక్టర్ పిఓలు హాజరై 25 జంటలకు ఆశీస్సులు అందించారు.




