1 May, 2026 | 3:37 AM

మద్యం మత్తులో గ్రామాలు..

01-05-2026 02:21 AM

విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు..

పట్టించుకోని అధికారులు..

తాడ్వాయి, ఏప్రిల్, 30 (విజయక్రాంతి): పచ్చని గ్రామాలు మద్యం మత్తులో ఊగిపోతున్నాయి. ఉదయం నుంచి రాత్రి వరకు ప్రజలు మద్యం సేవిస్తూ ఊగిపోతున్నారు. గ్రామాలలో ఎలాంటి అనుమతులు లేకుండా దర్జాగా మద్యాన్ని విక్రయిస్తున్నారు. అక్రమంగా విక్రయిస్తున్న మధ్యాన్ని నిరోధించాల్సిన ఎక్సైజ్ శాఖ అధికారులు మామూళ్ల మత్తులో ఉన్నారు. దీంతో ఎక్కడబడితే అక్కడ మద్యం విక్రయాలు యదేచ్చగా సాగుతున్నాయి.

కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలో మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి.అడిగే వారు ఎవరన్నా ధీమాతో వ్యాపారాలు ఇష్టారాజ్యంగా మద్యం అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. అందిన కాడికి దోచుకుంటున్నారు వైన్స్ షాప్ లో నిర్దేశించిన ధరలు కాకుండా తమ ఇష్టానుసారంగా ధరలు నిర్ణయించి అమ్ముకుంటున్నారు. అధిక ధరలకు మద్యం విక్రయాలు జరుగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదు.

ఎలాంటి అనుమతులు లేకుండానే మద్యం విక్రయాలు..

కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలోని గ్రామాల్లో ఎలాంటి అనుమతులు లేకుండానే మద్యం విక్రయాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం అనుమతించిన వైన్స్ షాపుల మాదిరిగానే షాపులు తెరిచి మరీ మధ్యాన్ని విక్రయిస్తున్నారు. షాపులలో పెద్దపెద్ద ప్రిడ్జిలు పెట్టుకొని మద్యాన్ని అమ్ముతున్నారు. ఇదంతా బహిరంగంగానే జరుగుతున్న సదరు ఎక్సైజ్ శాఖ అధికారులు గానీ, పోలీసులు కానీ అటువైపు కన్నెత్తి చూడడం లేదు.

నెల నెలా మద్యం వ్యాపారులు అందిస్తున్న మామూళ్లకు తలోగ్గే ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. ఉదయం నుంచే బెల్టు షాపుల్లో మద్యం దొరకడంతో యువకులు మత్తులో మునిగిపోతున్నారు. పనీపాట లేకుండా మత్తులో ఊగిపోతున్నారు. గ్రామాలలో అనువైన ప్రాంతాలలో సిటింగులు ఏర్పాటు చేసుకొని యదేచ్చగా మద్యం సేవిస్తున్నారు.

బెల్ట్ షాపులను మూసి వేయించాలి..

గ్రామాలలో అక్రమంగా నడిపిస్తున్న బెల్ట్ షాపులను వెంటనే మూసి వేయించాలని మహిళలు కోరుతున్నారు. గ్రామాల్లో ఎప్పుడు పడితే అప్పుడు అందుబాటులో మధ్యం ఉండడంతో యువకులు పని మానేసుకుని మరి  మద్యాన్ని సేవిస్తూ తిరుగుతున్నారని మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మద్యం గ్రామాల్లో అందుబాటులో లేకుంటే దూరంలో ఉన్న వైన్ షాప్ కు వెళ్లి మధ్యాన్ని తెచ్చుకోవడం ఇబ్బందిగా ఉంటుంది, దీంతో మద్యం సేవించడం తగ్గుతుందని వారు ఆపోతున్నారు.

ఎలాంటి అనుమతులు లేకుండా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న ఎందుకు అధికారులు చర్యలు తీసుకోవడం లేదని మహిళలు ప్రశ్నిస్తున్నారు. మండలంలోని కరడ్పల్లి, కన్కల్, దేమికలాన్,తాడ్వాయి,నందివాడ,ఏండ్రియాల, ఎర్రపహాడు, కృష్ణాజివాడి, బ్రహ్మాజీ వాడి, సంగోజువాడి, బ్రాహ్మణపల్లి, చిట్యాల సంతాయిపేట, సోమారం, చందాపూర్ గ్రామాలలో విచ్చలవిడిగా మధ్య విక్రాలు జరుగుతున్నాయి. ఒక్క తాడువాయి  మండలంలోనే కాకుండా జిల్లాలోని గ్రామాల్లో సైతం అక్రమంగా మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. అయినా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే అక్రమంగా విక్రయిస్తున్న మద్యం విక్రయాలను నిరోధించాలని ప్రజలు కోరుతున్నారు.