13 August, 2026 | 1:48 AM

బాక్సాఫీస్ వద్ద సాహో జోడీ ఫైట్!

13-08-2026 12:32 AM

చిత్ర పరిశ్రమలో ఎప్పుడు ఏ క్షణంలో ఎలాంటి సమీకరణాలు మారతాయో ఊహించడం కష్టం. తాజాగా బాక్సాఫీస్ వద్ద ఒక ఆసక్తికరమైన పోరుకు తెరలేచింది. ఒకప్పుడు వెండితెరపై కలిసి అలరించిన ‘సాహో’ జోడీ.. ఇప్పుడు థియేటర్లలో ఒకరితో ఒకరు పోటీ పడేందుకు సిద్ధమవుతున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘ఫౌజీ’ చిత్రంతో బాలీవుడ్ స్టార్ బ్యూటీ శ్రద్ధా కపూర్ చిత్రం ‘ఈఠ’ తలపడనుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఫౌజీ’ని డిసెంబర్ 3న భారీ స్థాయిలో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. అన్ని ప్రధాన భారతీయ భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే, దీనికి మరుసటి రోజే, అంటే..

డిసెంబర్ 4న శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘ఈఠ’ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. నిజానికి ‘ఈఠ’ చిత్రాన్ని ముందే (ఆగస్టు 14న) విడుదల చేయాలని భావించినప్పటికీ, కన్నడ స్టార్ యాష్ నటిస్తున్న ‘టాక్సిక్’ చిత్రంతో క్లాష్ రాకూడదనే ఉద్దేశంతో వాయిదా వేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమాను డిసెంబర్ బరిలో నిలిపారు. దీంతో కేవలం ఒక్క రోజు వ్యవధిలో ప్రభాస్, శ్రద్ధా కపూర్‌ల సినిమాలు థియేటర్లలోకి రానున్నాయి. ‘సాహో’ చిత్రంలో జంటగా నటించి మెప్పించిన ఈ ఇద్దరు స్టార్స్.. ఇప్పుడు బాక్సాఫీస్ రేసులో తలపడనుండటం సినీ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.