5 July, 2026 | 2:27 AM

ఆరెకరాల వరకు రైతు భరోసా

05-07-2026 12:45 AM
  1. ఐదో విడతలో 1.69 లక్షల మందికి లబ్ధి
  2. రైతుల ఖాతాల్లో రూ.545.41 కోట్లు జమ
  3. ఐదు రోజుల్లో 67.45 లక్షల మంది రైతులకు రూ.7,135.77 కోట్లు పంపిణీ మరో రికార్డు
  4. రైతుల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం
  5. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

హైదరాబాద్, జూలై 4 (విజయక్రాంతి): ఆరెకరాల వరకు రైతు భరోసా నిధులను శనివారం ప్రభుత్వం విడుదల చేసింది. ఐదో విడతలో భాగంగా 1.69 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుస్తూ.. వారి బ్యాంకు ఖాతాల్లో రూ.545.41 కోట్లను వేసింది. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీని నెరవేరుస్తూ రికార్డు స్థాయిలో రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేస్తోందని వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

జూన్ 30న రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రభుత్వం కేవలం ఐదు రోజుల వ్యవధిలోనే రూ.7,135.77 కోట్లను 67.45 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేసి మరో రికార్డు సృష్టించిందన్నారు. శనివారం రైతు భరోసా పథకం ఐదో విడతలో భాగంగా 5 నుంచి 6 ఎకరాల వరకు సాగుభూమి కలిగిన రైతులకు రూ.545.41 కోట్లను నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు మంత్రి వెల్లడించారు.

ఈ విడతలో రాష్ట్రవ్యాప్తంగా1.69 లక్షల మంది రైతులు రైతు భరోసా సాయం పొందారని తెలిపారు. ఇప్పటికే తొలి నాలుగు విడతలలో 4 ఎకరాల వరకు సాగుభూమి కలిగిన రైతులకు రైతు భరోసా నిధులు విడుదల చేశామన్నారు. రైతు సంక్షేమానికి సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, రైతుల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.