16 July, 2026 | 3:50 AM

గ్రామీణ రోడ్లకు మహర్దశ

16-07-2026 12:00 AM

ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి

ఇబ్రహీంపట్నం జూలై 15 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. బుధవారం మంచాల మండలంలో రూ. 9 కోట్ల నిధులతో రంగాపూర్ నుండి చీదేడు, దాద్పల్లి, నల్లవెల్లి గ్రామాల మీదుగా మాల్ వరకు నిర్మించ తలపెట్టిన బీటీ రోడ్డు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఈ కొత్త రోడ్డుతో ప్రజలకు రవాణా సౌకర్యం ఎంతో సులభతరం అవుతుందని తెలిపారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని అన్ని గ్రామాల అభివృద్ధికి పటిష్ట ప్రణాళికలు రూపొందిస్తూ, నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ముందు వరుసలో నిలపడమే తన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ చైర్మన్ కంబాలపల్లి గురునాథ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కొంగర విష్ణువర్ధన్ రెడ్డి, పలువురు సర్పంచ్లు, స్థానిక కాంగ్రెస్ నాయకులు, ఎమ్మార్వో ప్రసాదరావు, ఎండివో వసంతలక్ష్మి మరియు ఇతర ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.