నేటి నుంచి ఆర్టీసీ సమ్మె
ప్రభుత్వంతో జేఏసీ చర్చలు విఫలం
- తప్పని పరిస్థితుల్లో సమ్మెకు వెళ్తున్నాం: జేఏసీ నేత వెంకన్న
- సర్కార్‌కు నాలుగు వారాల గడువు ఇవ్వాలని కోరిన ఐఏఎస్‌ల కమిటీ
- జేఏసీ నేతలు ససేమిరా.. సమ్మెకు వెళ్తామని స్పష్టీకరణ
- ప్రధాన డిమాండ్లకైనా హామీ ఇవ్వకపోవడంపై అసంతృప్తి
- మంగళవారం అర్ధరాత్రి మొదటి షిఫ్టు నుంచే సమ్మె షురూ
- విజయవంతం చేయాలని కార్మికులకు పిలుపు
హైదరాబాద్, ఏప్రిల్ 21 (విజయక్రాంతి): రాష్ట్రప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ నేతలు జరిపిన చర్చలు విఫలమయ్యా యి. దీంతో మంగళవారం అర్ధరాత్రి మొదటి షిఫ్ట్ నుంచి సమ్మెకు దిగనున్న ట్లు జేఏసీ ప్రకటించింది. కార్మికుల సమస్యల పరిష్కారంపై ఐఏఎస్ అధికారుల కమిటీ సచివాలయంలో మంగళవారం రాత్రి వరకు జేఏసీ నేతలతో భేటీ అయిం ది. సర్కార్‌కు 4 వారాల సమయమివ్వాలని ఆర్టీసీ జేఏసీకి కమిటీ ప్రతిపాదించింది.
సమ్మెను కూడా విరమించుకోవాలని విజ్ఞప్తి చేసింది. అందుకు ససేమిరా అన్న జేఏసీ, ఇక తదుపరి కార్యాచరణ సమ్మె మాత్రమేనని స్పష్టం చేసింది. భేటీ అనంతరం ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న, వైస్ చైర్మన్ ఎం. థామస్‌రెడ్డి సచివాలయంలోని మీడియా పాయింట్ వద్ద మీడియాతో మాట్లాడారు. తమ సమస్యలన్నింటినీ ఐఏఎస్ అధికారుల కమిటీకి వివరించామని, కమిటీ తమ డిమాండ్లను సావధానంగా విన్నదని వివరించారు.
కమిటీ మరో నాలుగు వారాల గడువు కోరగా, తాము కుదరదని తేల్చిచెప్పామని వెల్లడించారు. గతేడాది మే నెలలో మంత్రి పొన్నం ప్రభాకర్‌తో ఓ భేటీ జరిగిందని, నాడు మంత్రి ప్రభుత్వానికి గడువు ఇవ్వాలని కోరారని, ఆ గడు వు ముగిసి కూడా ఏడాది పూర్తయిందని గుర్తుచేశారు. తమ డిమాండ్లలో ఒక్కటైనా కొత్తవి కావని, గతంలో ఇప్పటి ప్రభుత్వ పెద్దలు ఇచ్చిన హామీలేనని ఉద్ఘాటించారు.
కనీసం ప్రధాన డిమాండ్లకైనా పరిష్కారం దొరుకుతుందని ఆశించామని, కానీ.. అవి కూడా సాకారం కాలేదని వాపోయారు. తమ ౩౨ డిమాండ్లు సాధించే వరకు సమ్మె కొనసాగిస్తామని తేల్చిచెప్పారు. సర్కార్ కమిటీల పేరుతో కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. కార్మికులు ధైర్యంగా సమ్మెలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ప్రయాణికులకు ఇబ్బందులు..
సమ్మె కారణంగా మంగళవారం అర్ధరాత్రి నుంచి బస్సులు డిపోలకే పరిమితం కానున్నాయి. దీంతో బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులకు ఇబ్బందులు తప్పేలా లేవు. ముఖ్యంగా హైదరాబాద్, వరంగల్ వంటి నగరాల్లో సామాన్య ప్రజలు, విద్యార్థులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదే అదునుగా ప్రైవేట్ వా హనదారులు ఛార్జీలు పెంచే అవకాశం ఉంది.
అధికారుల కమిటీ..
ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం గతంలో ఐఏఎస్ అధికారుల కమిటీని నియమించింది. కమిటీ ఈమేరకు ఉద్యో గుల సమస్యలపై అధ్యయనం చేసి సర్కార్‌కు సిఫార్సులు చేయాల్సి ఉంది. కమిటీలో సీఎస్, రవాణా, రహదారులు, భవనాలశాఖ చైర్మన్, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, కార్మిక, ఉపాధి, శిక్షణ, కర్మాగారాల శాఖ సభ్యుడు, సీఎస్, ఆర్థికశాఖ సభ్యుడు, వైస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్, టీజీఎస్‌ఆర్టీసీ సభ్యుడు కన్వీనర్ సభ్యులు. ఈ కమిటీ అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించి, నాలుగు వారాల వ్యవధిలోపు ప్రభుత్వానికి ఒక నివేదికను సమర్పించాల్సి ఉంది. సమస్యల పరిష్కారానికి జేఏసీకు నాలుగు వారాల గడువు కోరగా జేఏసీ నేతలు తిరస్కరించారు.






