16 August, 2026 | 11:56 AM

సింగరేణి మారుపేర్ల అభ్యర్థుల ఆమరణ నిరాహార దీక్ష

16-08-2026 10:59 AM

దీక్షలో విషమిస్తున్న పలువురి ఆరోగ్యం...

విజిలెన్స్ పెండింగ్ కేసులపై తక్షణమే న్యాయం చేయాలి...

కొత్తగూడెం ఆగస్టు 16 విజయక్రాంతి: భద్రాద్రి జిల్లా సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదురుగా 36 గంటలుగా కొనసాగుతున్న, ఆమరణ నిరాహార దీక్ష — లక్కా శ్రావణ్ గౌడ్ బీపీ 90/70కి పడిపోవడంతో ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారింది. సింగరేణి మారుపేర్లు, విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్య పరిష్కారం కోసం కొనసాగుతున్న,ఆమరణ నిరాహార దీక్ష 36 గంటలు దాటింది. దీక్షలో పాల్గొంటున్న బాధితుల ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తోంది. దీక్షలో పాల్గొంటున్న బాధితుడు,ఆకుల సాక్షిరెన్ బ్లడ్ ప్రెషర్ 80/60గా నమోదైంది. మరో ముగ్గురు బాధితుల బ్లడ్ ప్రెషర్ కూడా తగ్గినట్లు తెలిపారు. దీక్షా శిబిరానికి చేరుకున్న వైద్యుడు బాధితుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి, గ్లూకోజ్ తీసుకోవాలని, ఆహారం తీసుకోవాలని సూచించారు.

అయితే బాధితులు మాత్రం తమ డిమాండ్‌పై వెనక్కి తగ్గడం లేదు. ప్రత్యేకంగా లక్కా శ్రావణ్ గౌడ్, “మా ఉద్యోగాల విషయంలో ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు నేను ఈ దీక్షను విరమించను” అని స్పష్టం చేసినట్లు బాధితులు తెలిపారు. తమ పిల్లలకు ఉద్యోగాలు రావాలనే ఆశతో, ఇంతటి కఠినమైన నిర్ణయం తీసుకున్న బాధిత కుటుంబాల పరిస్థితి అత్యంత భావోద్వేగంగా మారింది. ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న ఉద్యోగాల కోసం బాధితులు తమ దీక్షను కొనసాగిస్తున్నారు. “ ఉద్యోగాలపై స్పష్టమైన హామీ ఇవ్వండి…  దీక్షను విరమింప చేయండి” ప్రభుత్వం వెంటనే స్పందించి బాధితులతో చర్చలు జరిపి, ఉద్యోగాలపై స్పష్టమైన హామీ ఇవ్వాలని, ఆరోగ్య పరిస్థితి విషమించేలోపే ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుని తమ కుటుంబాలకు న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు.