రోడు భద్రత సామాజిక బాధ్యత
- ప్రతి ప్రాణం విలువైందే..
- ‘అరైవ్ అలైవ్’ లక్ష్యంగా ముందుకు సాగాలి
- డీజీపీ బి శివధర్ రెడ్డి
కరీంనగర్/ గజ్వేల్ ఏప్రిల్ 17(విజయక్రాంతి): వాహనంపై ప్రయాణించే ప్రతి ఒక్కరూ క్షేమంగా తమ ఇళ్లకు చేరుకోవాలనే ప్రధాన ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్, రవాణా శాఖల సమన్వయంతో ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమాన్ని ఒక సామాజిక ఉద్యమంగా చేపట్టిందని డీజీపీ బి శివధర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం నాడిక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో డీజీపీ మాట్లాడుతూ రాష్ట్రం లో శాంతిభద్రతల సమస్య కంటే రోడ్డు ప్రమాదాలే అతిపెద్ద సవాలుగా మారాయన్నారు.
గత ఏడాది రాష్ట్రంలో హత్యల వల్ల 800 మంది ప్రాణాలు కోల్పోగా, రోడ్డు ప్రమాదాల వల్ల ఏకంగా 7,500 మంది మృతి చెందడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోందన్నారు.రోడ్డు భద్రత అనేది కేవలం పోలీస్, రవాణా శాఖల బాధ్యత మాత్రమే కాదని, వార్డు మెంబర్ నుంచి సీఎం వరకు అందరూ ఇందులో భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారని తెలిపారు.అందుకే మొదటిసారిగా పోలీస్ శాఖ కార్యక్రమాన్ని ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’లో చేర్చామని తెలిపారు.
జిల్లాలో జరుగుతున్న ప్రమాదాల్లో 70% మరణాలు ద్విచక్ర వాహనదారులవే ఉంటున్నాయి. బైక్ నడిపే వారితో పాటు వెనుక కూర్చున్న వారు కూడా నాణ్యమైన హెల్మెట్ ధరించాలని, తప్పనిసరిగా స్ట్రిప్ పెట్టుకోవాలని సూచించారు.ఫోర్ వీలర్ వాహనాల్లో ప్రయాణించే అందరూ సీట్ బెల్ట్ ధరించాలన్నారు. కార్యక్రమంలో అరైవ్ - అలైవ్‌కి సంబంధించిన స్కై బెలూన్, పోస్టర్, అరైవ్ - అలైవ్ పాట సీడీని డీజీపీ ఆవిష్కరించి అనంతరం హెల్మెట్ పంపిణీ చేశారు.
కరీంనగర్ పోలీసుల తరుపున ఏ ర్పాటు చేసిన వివిధ స్టాళ్లను సందర్శించారు. కార్యక్రమంలో పాల్గొన్న వారందరితో రోడ్డు భద్రత ప్రతిజ్ఞ చేసారు. జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, కరీంనగర్ సీపీ గౌస్ ఆలం, అడిషనల్ కలెక్టర్ స్థానిక సంస్థలు అశ్విని, డీఎంహె చ్‌ఓ వెంకటరమణ, ఎంవీఐ చక్రవర్తి , ట్రైనీ ఐపీఎస్ సోహం సునీల్, అడిషనల్ డీసీపీ వెంకటరమణతో పాటు ఇతర అధికారులు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
రోడ్డు నిబంధనలపై చైతన్యం అవసరం
రోడ్డు భద్రత, నియమాలు, ప్రమాదాల నిర్మూలనపై ప్రతి ఒక్కరు చైతన్యం కలిగి ఉండాలని డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని మహతి ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన అరైవ్ అలైవ్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. రోడ్డు ప్రమాదాలు నివారించి ప్రమాదాలు అరికట్టేందుకు అరైవ్ అలైవ్ ప్రతిష్టాత్మకంగా చేపడుతుండగా, ఈ కార్యక్రమ లక్ష్యాలు ప్రతి ఒక్కరికి చేరాలన్నారు.
రోడ్డు భద్రత కమిటీలతో క్షతగాత్రులకు త్వరితగతిన వైద్య సహా యం అందించే వారికి ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్లు చెప్పా రు. మానవ తప్పిదాలతోనే రోడ్డు ప్రమాదాలు జరుగుతుండగా, రోడ్డు భద్రత నియమాలు పాటిస్తే చక్కటి ఫలితాలు వస్తాయని చెప్పారు. వారం రోజుల పాటు ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశ్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ హైమావతి, జిల్లా పోలీస్ కమిషనర్ రష్మీ పె రుమాళ్, ట్రైనీ ఐపీఎస్ అయేషా ఫాతిమా, ఏసిపి నర్సింలు, తదితరులు పాల్గొన్నారు.






