3 September, 2026 | 2:20 AM

రైస్ మిల్లర్ల సమస్యలు పరిష్కరించాలి

03-09-2026 | 12:19am
  1. ప్రభుత్వానికి రైస్‌మిల్లర్ల అసోసియేషన్ డిమాండ్
  2. 6న ఇందిరాపార్కు వద్ద నిరసన, 11న మిల్లుల బంద్

హైదరాబాద్, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి) : తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రైస్ మిల్లర్లు రాష్ట్ర ప్రభుత్వానికి డెడ్‌లైన్ విధించారు. నాలుగు రోజుల్లో మిల్లర్లతో చర్చలు జరిపి, పరిష్కార మార్గం చూపాలని గడువు పెట్టారు. లేదంటే ఉద్యమం తీవ్రతరం చేస్తామని మిల్లర్ల సంఘం హెచ్చరించింది. హైదరాబాద్‌లోని ఉప్పల్ భగాయత్‌లోని ఓ అసోసియేషన్ భవన్ లో బుధవారం రైస్‌మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (Ricemillers Welfare Association) రాష్ట్ర జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించారు.

ఈ సందర్భంగా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పాడి గణపతి రెడ్డి మాట్లాడుతూ రైస్ మిల్లర్ల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 6న ఇందిరాపార్కు వద్ద నిరసన చేపడుతున్నామన్నారు.  11వ తేదీన మిల్లుల బంద్ పాటిస్తామన్నారు. ఎలాంటి సమాచారం లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా మిల్లుల్లో చేపట్టే తనిఖీలు, దాడులను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. కేసులు నమోదును ఉపసహరించుకోవాలని కోరారు. మిల్లర్ల సమస్యలు వినేందుకు సీఎం అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

ఖరీఫ్ ధాన్యానికి సంబంధించి రా రైస్ మిల్లర్లకు, అలాగే రబీ ధాన్యానికి సంబంధించి బాయిల్ రైస్ మిల్లులకు డబుల్ కోటాను కేటాయించాలన్నారు. టెండర్ ధాన్యం ధర తేడా వల్లనే విజిలెన్స్ దాడులు, కేసులు, ఇండస్ట్రీ మొత్తం ఆగమవుతున్నదన్నారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని చార్జీలను వెంటనే విడుదల చేయాలన్నారు.

200హెచ్‌పీ  కరెంటు కనెక్షన్లను ఎల్టీ కేటగిరీలో ఇవ్వాలని, పీవీ పేరు షార్ట్ ఫాల్ అని 25శాతం, వడ్డీ 12 వేయకుండా ఎంఎస్పీ రేటుతో రికవరీ చేయాలని కోరారు. తప్పని సరిగా ప్రతి రైస్ మిల్లులో 10 శాతం నుంచి 15 శాతం షార్ట్ ఫాల్ అధికారికంగా ఉంటుందన్నారు. ఎఫ్‌ఏ క్యూ క్వాలిటీ ధాన్యం ఇవ్వాలని, సరైన సిబ్బందిని ఏర్పాటు చేసి ఎఫ్‌సీఐ లాగా, సీసీఐ పత్తి కొనుగోళ్ల మాదిరిగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.