19-02-2026 06:07:42 PM
బోధన్: (విజయ క్రాంతి):సాలూర మండలంలోని మందర్న శివారు ప్రాంతంలో మంజీరా నది నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాలీ ఆటోలను గురువారం రెవెన్యూ అధికారులు సాలూర శివారులో దాడి చేసి పట్టుకోవడం జరిగింది. ఇన్చార్జి తహసిల్దార్ అనుష తెలిపిన వివరాల ప్రకారం మందర్న మంజీరా నదీ పరివాహక ప్రాంతం నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నట్లు సమాచారం మేరకు రెవెన్యూ సిబ్బంది నిఘా పెట్టారు. మందర్న నుంచి ఇసుక లోడుతో వస్తున్న వాహనాలను సాలూర శివారులో అడ్డుకుని తనిఖీ చేయగా, ఎటువంటి అనుమతులు లేవని తేలింది. దీంతో రెండు ట్రాలీ ఆటోలను స్వాధీనం చేసుకుని స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను తరలిస్తే వాహనాలను సీజ్ చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని తహశీల్దార్ హెచ్చరించారు. ఈ తనిఖీల్లో రెవిన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.