3 August, 2026 | 11:43 PM

నాగేపల్లిలో పేకాట రాయుళ్ల ఆటకట్టు

03-08-2026 09:57 PM

పోలీసుల మెరుపుదాడి.. ఏడుగురు అరెస్ట రూ.35,200 స్వాధీనం

సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతాం ఎస్ఐ శ్రీనివాస్

రామగిరి,(విజయక్రాంతి): ఇళ్ల మధ్యన గుట్టుచప్పుడు కాకుండా పేకాట శిబిరాలు నిర్వహిస్తూ, కష్టపడ్డ సొమ్మును జూదంలో తగలేస్తున్న పేకాట రాయుళ్లకు రామగిరి పోలీసులు కోలుకోలేని షాక్ ఇచ్చారు. నాగేపల్లి గ్రామంలోని ఒక నివాస గృహంలో రాత్రివేళల్లో యథేచ్ఛగా సాగుతున్న పేకాట స్థావరంపై పోలీసులు మెరుపుదాడి చేసి ఏడుగురు జూదరుల ఆటకట్టించారు.

నాగేపల్లి గ్రామంలో నగదును పందెంగా పెట్టి పేకాటడుతున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందడంతో  పోలీసులు ఆదివారం రాత్రి ఆకస్మికంగా దాడి చేశారు. పోలీసులను చూసి పారిపోయేందుకు యత్నించిన నిందితులను చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి రూ. 35,200 నగదు, మొబైల్ ఫోన్లు 07, 52 పేకముక్కలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఎస్ఐ నిందితులను న్యాయస్థానంలో హాజరుపరచనున్నట్లు తెలిపారు.

చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేకాట, జూదం, మాదకద్రవ్యాల విక్రయం, అక్రమ మద్యం తయారీ, గుట్కా రవాణా వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపుతామని తీవ్రంగా హెచ్చరించారు.  తమ పరిసరాల్లో చట్టవిరుద్ధ పనులు జరుగుతుంటే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు గానీ లేదా డయల్-100 కు గానీ సమాచారం అందించాలని ఎస్ఐ ప్రజలను కోరారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లు, వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని ఎస్ఐ హామీ ఇచ్చారు.