3 August, 2026 | 11:43 PM

జర్నలిస్టుల హక్కుల సాధనకు కార్యాచరణ!

03-08-2026 09:53 PM

అర్హులందరికీ ఇంటి స్థలం, హెల్త్ కార్డులు

టీయూడబ్ల్యూజే(ఐజేయు) జిల్లా కార్యవర్గంలో తీర్మానాలు

సంగారెడ్డి: అర్హులైన జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు వచ్చే వరకు నిరంతరం పోరాటం కొనసాగించాలని తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు (టీ యూడబ్ల్యూజే- ఐజేయు) సంగారెడ్డి జిల్లా శాఖ తీర్మానించింది. జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి అధ్యక్షతన సదాశివపేట లో సోమవారం జిల్లా కార్యవర్గ తొలి సమావేశం జరిగింది. రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం ఏ కే పైసల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు నిత్యం ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై చర్చించారు. అంతేకాకుండా వాటి పరిష్కారానికి కార్యాచరణ రూపొందించారు.

ఇంటి స్థలం, హెల్త్ కార్డు, యూనియన్ భవనం గురించి అధికారులను ప్రజా ప్రతినిధులను కలిసి వినతి పత్రాలను సమర్పించాలని తీర్మానించినట్టు జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి ప్రకటించారు. సంగారెడ్డి తో పాటు , జహీరాబాద్, సదాశివపేట నారాయణఖేడ్ జోగిపేట పటాన్చెరు నియోజకవర్గాల్లో కమిటీలను ఏర్పాటు చేయాలని తీర్మానించారు. హత్నూరలో కూడా త్వరలో కమిటీ వేయనున్నట్లు ప్రకటించారు.  అంతేకాకుండా ప్రతి జర్నలిస్టుకు హెల్త్ కార్డు కోసం రాష్ట్ర ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తేవాలని సమావేశం నిర్ణయించింది.

మిగిలిన జర్నలిస్టులకు కూడా అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తీర్మానించారు. కేబుల్ టీవీ జర్నలిస్టులకు తక్షణమే ఒక యూనిట్ అక్రిడేషన్ కార్డు మంజూరు చేయాలని కోరారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు పైసల్ మాట్లాడుతూ యూనియన్ బలోపేతానికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని సూచించారు. క్రమశిక్షణ రాహిత్యాన్ని సహించేది లేదని అన్నారు. ప్రతి ఒక్కరు తమ వంతుగా ఇతరులను కలుపుకొని పోవాలని సూచించారు. మన ఐక్యతే మన విజయానికి సూత్రం అని చెప్పారు.