3 August, 2026 | 11:43 PM

శివశివాని గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ బ్లూ సఫైర్ జూబ్లీ వేడుకలు

03-08-2026 10:04 PM

ముఖ్య అతిథిగా హాజరైన కల్నల్ గౌరవ్ దత్తా

కుత్బుల్లాపూర్,(విజయక్రాంతి): విద్యా రంగంలో శివశివాని గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ 65 సంవత్సరాల విశిష్ట సేవలను పూర్తి చేసుకున్న సందర్భంగా బ్లూ సఫైర్ జూబ్లీ (1961–2026) వేడుకలను సోమవారం కొంపల్లి లోని హైందవ గౌరిక్ కన్వెన్షన్ లో ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి భారత సైన్యంలో విశిష్ట సేవలందించిన కల్నల్ గౌరవ్ దత్తా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కల్నల్ గౌరవ్ దత్తా మాట్లాడుతూ... శివశివాని నా జీవితంలో ఒక విద్యాసంస్థ మాత్రమే కాదు, వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దిన ఆలయం.

సైన్యంలో నేర్చుకున్న ధైర్యం, నాయకత్వం, క్రమశిక్షణకు ఇక్కడ పొందిన విలువలే బలమైన పునాది అని అన్నారు.నేటి విద్యార్థులు సవాళ్లను అవకాశాలుగా మార్చుకుంటూ దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. క్రమశిక్షణ, ధైర్యం, పట్టుదలతో కూడిన ఆయన జీవితం యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. అనంతరం విద్యా సంస్థ ప్రెసిడెంట్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆరతి సంపతి మాట్లాడుతూ గత 65 సంవత్సరాలుగా శివశివాని గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ వేలాది మంది విద్యార్థులను విద్య, విలువలు, నాయకత్వ లక్షణాలతో, దేశ విదేశాల్లో వివిధ రంగాల్లో రాణించేలా తీర్చిదిద్దిందని తెలిపారు.

పాఠశాల విద్య నుంచి ఉన్నత, వృత్తిపరమైన విద్య వరకు నాణ్యమైన విద్యను అందిస్తూ సంస్థ విశిష్ట గుర్తింపు పొందిందన్నారు. గత ఆరు దశాబ్దాలుగా శివశివాని గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ విద్యార్థుల్లో విద్యా ప్రావీణ్యం, నైతిక విలువలు, నాయకత్వ లక్షణాలు, ఆవిష్కరణాత్మక దృక్పథం, సమగ్ర వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందిస్తూ వేలాది మంది విజయవంతమైన పూర్వ విద్యార్థులను సమాజానికి అందించిందని అన్నారు. విద్యా సంస్థ వైస్ ప్రెసిడెంట్ డా. శైలేష్ సంపతి మాట్లాడుతూ, భవిష్యత్తులో కూడా ప్రపంచ స్థాయి విద్య, విలువలతో కూడిన నాయకత్వం, ఆవిష్కరణలకు ప్రాధాన్యం ఇస్తూ సమాజానికి బాధ్యతాయుతమైన పౌరులను తీర్చిదిద్దేందుకు శివశివాని గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ కట్టుబడి ఉందని తెలిపారు.

తల్లిదండ్రులు, విద్యార్థులు, పూర్వ విద్యార్థులు సంస్థపై ఉంచిన అపారమైన విశ్వాసం, ఆదరణతో నేడు శివశివాని గ్రూప్ ఒకే క్యాంపస్‌లో రెండు డిగ్రీ కళాశాలలు, ఒక పాఠశాల, ఒక జూనియర్ కళాశాల, అలాగే మేనేజ్‌మెంట్ విద్యాసంస్థలను విజయవంతంగా నిర్వహిస్తోందని పేర్కొన్నారు. బ్లూ సఫైర్ జూబ్లీ వేడుకల్లో వివిధ విభాగాల అధిపతులు,  విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, అధ్యాపకులు, పరిశ్రమల ప్రముఖులు, విశిష్ట అతిథులు,  పాల్గొని సంస్థ వ్యవస్థాపకుల దూరదృష్టిని స్మరించుకున్నారు.