ఇజ్రాయెల్‌పై ప్రతీకార దాడులు
బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడిన ఇరాన్
నలుగురు మృతి.. మరో నలుగురు క్షతగాత్రులు
టెల్‌అవీవ్, ఏప్రిల్ 6: అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడులకు ప్రతిగా ఇరాన్ కూడా తన దాడులను ఉధృతం చేసింది. దీనిలో భాగంగానే సోమవారం ఇజ్రాయెల్ పై బాలిస్టిక్ మిసైళ్లతో విరుచుకుపడింది. ఇజ్రాయెల్ రాజధాని టెల్‌అవీవ్ సహా 15 ప్రాంతాలను టార్గెట్ చేసింది. ఉత్తర ఇజ్రాయెల్‌లోని హైఫా నగరంపై క్షిపణుల వర్షం కురిపించింది. పేలుళ్లలో నలుగురు పౌరులు మరణించినట్లు ఇజ్రాయెల్ అత్యవసర సేవా విభాగం ప్రకటించింది. మృతుల్లో 80 ఏళ్ల వద్ధ దంపతులతోపాటు మరో ఇద్దరు ఉన్నారని తెలిపింది. మరో చిన్నారితో సహా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. అలాగే, దాడుల్లో పలు భవనాలు, పాఠశాలలు ధ్వంసమయ్యాయి. తమ పౌరులను చంపాలని చూస్తున్నవారిని వదిలిపెట్టబోమని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు హెచ్చరించారు.




