18 April, 2026 | 3:44 AM

బిల్లులపై స్పందన

18-04-2026 02:03 AM

సమాఖ్య స్ఫూర్తికి నిదర్శనం

దక్షిణాది రాష్ట్రాలన్నీ ఏకతాటిపైకి వచ్చి తమ నిరసన గళాన్ని వినిపించాయి. లోక్‌సభలో ప్రజాస్వామ్యం విజయం సాధించింది. మహిళా రిజర్వేషన్ల పేరుతో రాజకీయ ప్రయోజనాల కోసం నియోజకవర్గాల పునర్విభజనను రుద్దాలని చూడటం సరికాదు. ఈ పద్ధతిని మేం ఎప్పుడూ వ్యతిరేకిస్తాం. కేవలం ఎన్నికల గెలుపు కోసం మహిళలను పావులుగా వాడుకోవాలని బీజేపీ చూస్తోంది. దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని తగ్గించే కుట్రలను మేం సాగనివ్వం. బిల్లు వీగిపోవడం దేశ సమాఖ్య స్ఫూర్తికి నిదర్శనం.

ఎంకే స్టాలిన్, తమిళనాడు ముఖ్యమంత్రి

కేంద్ర కుట్రలకు చెక్

దక్షిణాది రాష్ట్రాల అధికారాలను హరించేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలకు బిల్లు వీగిపోయి చెక్ పెట్టింది. జనాభా ప్రాతిపదికన సీట్లను పెంచడం వల్ల కేరళ వంటి రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుంది. అభివృద్ధి చెందిన రాష్ట్రాలను శిక్షించే ఈ విధానాన్ని మేం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మహిళా కోటా అమలు కావాలంటే తక్షణమే చేయవచ్చు. దానికి పునర్విభజనతో సంబంధం ఏమిటో ప్రభుత్వం వివరించలేదు. రాజ్యాంగబద్ధమైన హక్కుల రక్షణ కోసం విపక్షాలన్నీ ఏకతాటిపై నిలబడటం శుభపరిణామం.

పినరయి విజయన్, కేరళ ముఖ్యమంత్రి

    కేంద్రానికి గుణపాఠం

    ప్రభుత్వం కేవలం తన స్వార్థం కోసం రాజ్యాంగాన్ని వాడుకోవాలని చూస్తోంది. మహిళా కోటాపై మాకు పూర్తి మద్దతు ఉంది, కానీ పునర్విభజనతో దానిని లింక్ చేయడం అన్యాయం. అన్ని పార్టీలను సంప్రదించకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధం. విపక్షాలు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకే ఈ పరిస్థితి వచ్చింది. ఇది మహిళల విజయానికి ఆటంకం కాదు, ప్రభుత్వ అహంకారానికి లభించిన గుణపాఠం. ఇకనైనా పారదర్శకమైన పద్ధతిలో చర్చలు జరపాలి.

    మల్లికార్జునఖర్గే, ఏఐసీసీ అధ్యక్షుడు

    ఓటు బ్యాంకు రాజకీయాలు తగదు

    బెంగాల్ ప్రజల పక్షాన, మహిళల పక్షాన ఈ బిల్లును మేము వ్యతిరేకించాం. మహిళా శక్తిని కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వాడుకోవాలని చూడటం హీనమైన చర్య. నియోజకవర్గాల పునర్విభజన కమిటీల పేరుతో రాష్ట్రాల హక్కులను కాలరాస్తున్నారు. మేము మా రాష్ట్ర ప్రజల ప్రాతినిధ్యాన్ని కాపాడుకుంటాం. కేంద్ర ప్రభుత్వం తన మొండివైఖరిని విడనాడాలి. మహిళలకు నిజమైన అధికారం ఇవ్వాలంటే ఎలాంటి షరతులు లేని రిజర్వేషన్లు తీసుకురావాలి.

    మమతా బెనర్జీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి

    సోనియాను బలిదేవత అనలేదా?

    తెలంగాణ ఉద్యమకారులను దేశభక్తులతో పోలుస్తూ బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య దేశ విభజన అంశాన్ని ప్రస్తావిస్తే కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతలు వివాదం చేయడమేంటని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించిన రేవంత్‌రెడ్డి ఆనాడు సోనియాగాంధీని బలిదేవత అంటూ తూలనాడిన విషయాన్ని మర్చిపోయారా? అని ప్రశ్నించారు. సోనియాగాంధీ వల్లే ఆనాడు వెయ్యిమందికిపైగా తెలంగాణ యువకులు చనిపోయారని రేవంత్‌రెడ్డి చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. శుక్రవారం న్యూఢిల్లీలోని తన నివాసంలో మీడియాతో బండి సంజయ్ మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదంపై దేశమంతా ఎదురు చూస్తోందని, బీజేపీకి ఎక్కడ క్రెడిట్ వస్తుందనే భయంతోనే ప్రజల ద్రుష్టిని మళ్లించేందుకు ఇలాంటి కుట్రలకు తెరదీశారని విమర్శించారు. 

    కేంద్రమంత్రి బండి సంజయ్