20 August, 2026 | 4:28 AM

డిమాండ్లు తక్షణమే పరిష్కరించండి

20-08-2026 12:30 AM
  1. పీఆర్సీ చర్చల కమిటీని ఏర్పాటు చేయాలి
  2. అన్ని కేటగిరీల్లో ఖాళీలు భర్తీ చేయాలి
  3. నెరవేర్చకపోతే 27 నుంచి ఆందోళనలు
  4. టీజీపీఈజేఏసీ నేతలు విద్యుత్ సౌధ ఎదుట ఉద్యోగుల,ఆర్టిజన్లు, పెన్షనర్ల మహాధర్నా

ఖైరతాబాద్,ఆగస్టు19(విజయక్రాంతి): విద్యుత్ ఉద్యోగులు,ఆర్టిజన్లు, పెన్షనర్ల న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్ విద్యుత్ సౌధ ఎదుట మహాధర్నా నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది ఉ ద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ సాయిబాబా, కన్వీనర్ రత్నాకర్‌రావు, జనరల్ సెక్రెటరీ శ్రీధర్, కో-కన్వీనర్లు బీసీ రెడ్డి, వజీర్, మహేష్ తదితరులు మాట్లాడుతూ జేఏసీ ప్రతిపాదించిన పీఆర్‌సీ 2026 చర్చల కమిటీని వెంటనే ఏర్పాటు చేయడం, యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌లో సీహెచ్ పీ, ఏహెచ్‌పీ, ఓఅండ్‌ఎం ప్రైవేటీకరణను ఉపసంహరించడం, ఆర్టిజన్లకు ఏపీఎస్‌ఈబీ సర్వీస్ రూల్స్ అమలు చేయడం

1999-2004 మధ్య నియమితులైన ఉద్యోగులకు జీపీఎఫ్, పెన్షన్ సౌకర్యం కల్పించడం, అన్ని కేటగిరీల్లో ఖాళీలను భర్తీ చేయడం తదితర డిమాండ్లను తక్షణమే నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే ఈపీఎఫ్ ఉద్యోగులకు పెన్షన్ సీలింగ్ లేకుండా యాజమాన్య వాటా చెల్లించాలని, ఉద్యోగులకు రెగ్యులర్ ప్రమోషన్లు కల్పించాలని, సబ్‌స్టేషన్ల నిర్వహణకు అవసరమైన పోస్టులను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

2022 వేతన సవరణలోని లోపాలను సరిదిద్దాలని, పారదర్శక జనరల్ ట్రాన్స్‌ఫర్ పాలసీ అమలు చేయాలని కోరారు. రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడంతో పాటు ట్రాన్స్‌మిషన్, డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌ను ఆధునీకరించాలన్నారు. ప్రభుత్వం, విద్యుత్ సంస్థల యాజమాన్యాలు జేఏసీ నాయకులతో తక్షణమే చర్చలు జరిపి సమస్యలకు పరిష్కారం చూపాలన్నారు.

తమ డిమాండ్లపై సానుకూల నిర్ణయం తీసుకోకపోతే ఈనెల 27 నుంచి అన్ని జెన్కో జనరేటింగ్ స్టేషన్లు, ట్రాన్స్‌కో, డిస్కంల సర్కిల్ కార్యాలయాల వద్ద రిలే నిరాహార దీక్షలు చేపడతామని హెచ్చరించారు. యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌లో సీహెచ్‌పీ, ఏహెచ్‌పీలఓ అండ్‌ఎం కార్యకలాపాలను పూర్తిగా అవుట్‌సోర్స్ చేసే టెండర్‌ను ఫైనలైజ్ చేస్తే మెరుపు చర్యలకు దిగుతామన్నారు.

కార్యక్రమంలో వెంకటేశ్వర్లు, నీలం ఐలేష్, సదానందం, తాజుద్దీన్ బాబా, కరుణాకర్రెడ్డి, రాంజీ, రాధాకృష్ణ, నెహ్రూ, మేడి రమేష్, కేవీ రామారావు, స్వామి, సత్యనారాయణరావు, మోసెస్, జేఎల్. జనప్రియ, భూపాల్‌రెడ్డి, ఈశ్వర్‌గౌడ్, శ్రీనివాస్‌రెడ్డి, సురేష్‌కుమార్, విద్యాసాగర్, వెంకటేష్, యుగంధర్, అశోక్కుమార్, తిరుపతి పాల్గొన్నారు.