17 April, 2026 | 10:25 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

దళిత క్రిస్టియన్లకు రిజర్వేషన్లు వర్తింపజేయాలి

14-04-2026 05:28 PM

దళిత క్రిస్టియన్ల రిజర్వేషన్ల తీర్పుపై సుప్రీం కోర్టు పున సమీక్షించాలి

మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి

హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): అంబేద్కర్ చూపిన మార్గంలో దళితులందరంకలిసి హక్కులను కాపాడుకుందామని, దళిత క్రిస్టియన్లకు రిజర్వేషన్లు వర్తించవని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా హన్మకొండలోని అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. దేశంలో కొందరు రాజ్యాంగానికి తూట్లు పొడవాలని, దళితుల రిజర్వేషన్లను కలరాసే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా దళితులకు, బడుగు బలహీన వర్గాలకు కల్పించిన రిజర్వేషన్లు లేకపోతే ఇప్పుడు ఎక్కడ ఉండేవాళ్లమో తలుచుకుంటేనే భయంగా ఉందన్నారు. దేశంలో కొంతమంది పాలకులు రాజ్యాంగాన్ని మార్చేయాలని, రిజర్వేషన్లు ఎత్తివేయాలని చూస్తున్నారని విమర్శించారు. రిజర్వేషన్లు ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేసి దళితుల ఉద్యోగ అవకాశాలను హరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇటీవల సుప్రీంకోర్టు దళిత క్రిస్టియన్లకు రిజర్వేషన్లు వర్తించవని తీర్పు ఇచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తూ, తన దృష్టిలో ఆ తీర్పు సరైంది కాదని, దానిపై పునఃసమీక్ష జరగాలని కోరారు. పుట్టుకతోనే కులం వస్తుందని, కానీ మతం మధ్యలో వస్తుందని తెలిపారు. క్రిస్టియన్‌గా మారినంత మాత్రాన దళితుల జీవితాల్లో మార్పు వచ్చిందా అని ప్రశ్నించారు. ఏ గ్రామానికి వెళ్లినా అత్యంత పేదవారు దళితులే ఉంటారని అన్నారు. దేశంలో కుల వ్యవస్థ ఉన్నంతకాలం, అంటరానితనం, అసమానతలు, అవమానాలు కొనసాగుతున్నంతకాలం, సమసమాజ స్థాపన జరిగే వరకు, కుల వ్యవస్థ పూర్తిగా నిర్మూలన చెందే వరకు రిజర్వేషన్లు కొనసాగాలని స్పష్టం చేశారు.

రాజ్యాంగంపై దళితుల రిజర్వేషన్లపై జరుగుతున్న కుట్రలను అడ్డుకోవాలంటే పోరాటమే మార్గమని తెలిపారు. అవగాహన చైతన్యం చదువు అవసరం అని, దళితులందరూ చదువును ఆయుధంగా చేసుకుని ఐక్యంగా తమ హక్కులను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, కూడా చైర్మన్, హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎనగాల వెంకట్రాంరెడ్డి, జిల్లా కలెక్టర్ చాహత్ వాజ్ పాయ్ దళిత సంఘ నాయకులు మంద కుమార్ మాదిగ పుట్ట రవి మాదిగ గద్దల సుకుమార్ మాదిగ, కందుకూరి పూర్ణచందర్, ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.