9 May, 2026 | 1:27 AM

మోదీతోనే చట్టసభల్లో రిజర్వేషన్ సాధ్యం

09-05-2026 12:06 AM

కులగణనను కేంద్ర ప్రభుత్వం అంగీకరించడం చరిత్రాత్మకం

అసెంబ్లీ, పార్లమెంట్‌లో బీసీ బిల్లు పెట్టి 50% రిజర్వేషన్లు కల్పించాలి

బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఎంపీ ఆర్. కృష్ణయ్య

ముషీరాబాద్, మే 8 (విజయక్రాంతి): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం చరిత్రలో నిలిచిపోయే నిర్ణయాలు తీసుకుంటుందని, కులగణన తరువాతే చట్టసభలలో రిజర్వేషన్ సాధ్యం అని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య స్పష్టం చేశారు.

ఈ మేరకు శుక్రవారం  కాచిగూడలో 13 బీసీ సంఘాల సమావేశానికి నీలం వెంకటేష్ ముదిరాజ్, సి. రాజేందర్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ కృష్ణయ్య మాట్లాడుతూ ప్రస్తుతం జనగణనలో కులగణన చేస్తామని కేంద్రం ప్రకటించిందని, దీనిపై ఎటువంటి అనుమానాలు అవసరం లేదన్నారు. బీసీలకు జనాభా ప్రకారం విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాలలో జనాభా ప్రకారం వాటా లభిస్తుందన్నారు.

పార్లమెంట్‌లో బీసీ బిల్లు పెట్టి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నారు. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేసి 2 లక్షల కోట్లతో అభివృద్ధి పథకాన్ని ప్రకటించాలని కోరారు. బీసీల విద్య, ఉద్యోగ రిజర్వేషన్లను 50 శాతానికి పెంచాలన్నారు. విద్య, ఉద్యోగ రిజర్వేషన్స్‌పై క్రిమిలేయర్‌ను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.  సమావేశంలో బీసీ సంఘం నేతలు పర్ల గొర్ల మోడీ రాందేవ్, నిఖిల్ పటేల్, అశోక్, బలరాం, మల్లేష్ యాదవ్, రాము తదితరులు పాల్గొన్నారు.