9 May, 2026 | 2:41 AM

ఘనంగా రవీంద్రనాథ్ ఠాగూర్ 165వ జయంతి

09-05-2026 12:08 AM

ముషీరాబాద్, మే 8 (విజయక్రాంతి): విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ 165వ జయంతి సందర్భంగా ‘రిమెంబరింగ్ ఠాగూర్’ పేరుతో ప్రత్యేక సంగీత-సాహిత్య కార్యక్రమం శుక్రవారం రాత్రి నగరంలోని లమకాన్ వేదికగా ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమం సంగీతం, సాహిత్యం, నృత్యం, కవిత్వం సమ్మేళనంగా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

కార్యక్రమ ప్రారంభానికి ముందు ఇటీవల పరమపదించిన ప్రముఖ రచయిత్రి, లమకాన్ సహ వ్యవస్థాపకుడు అష్హర్ ఫర్హాన్ తల్లి జీలానీ బానోకు నివాళులర్పించారు. అనంతరం జాతీయ గీతంతో కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్బంగా హైదరాబాద్‌లో ఎన్నో సంవత్సరాలుగా నివసిస్తున్న బెంగాలీ సాంస్కృతికాభిమానిని సంగమిత్ర మల్లిక్ తన ‘రిమెంబరింగ్ ఠాగూర్’ శ్రేణిలో మూడోభాగాన్ని సమర్పించారు.

ఈ కార్యక్రమంలో ఠాగూర్ గీతాల పూజా, ప్రేమ్, ప్రకృతి, విచిత్రో, నృత్యనాట్య విభాగాలకు చెందిన ఎన్నో గీతాలు ప్రదర్శించబడ్డాయి. ’ఆమార్ ముక్తి ఆలోయ్ ఆలోయ్’ గీతంతో కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగమిత్ర, త్యాగరాజ స్వామి కృతి ఆధారంగా రూపొందిన ‘లాబొన్నే పూర్ణ ప్రాణే’ గీతాన్ని హృద్యంగా ఆలపించారు. పలు గీతాలకు కమలిని శ్రీనివాస్ అందించిన నృత్య ప్రదర్శనలు, కమలిని శ్రీనివాస్ అందించిన సితార్, సంగమిత్ర ఆలపించిన గీతాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సంగమిత్ర మల్లిక్‌కు తబలాపై శశి భూషణ్ సహకరించగా, కార్యక్రమాన్ని డా.ఆర్.శంకర్ తన ప్రత్యేక వ్యాఖ్యాన శైలితో సమన్వయం చేసి ప్రేక్షకుల ప్రశంసలను అందుకున్నారు.