పంచాయతీ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని వినతి
11-04-2026 12:37 AM
చివ్వెంల, ఏప్రిల్ 10: మండలంలోని పిల్లలజెగ్గుతండ గ్రామ పంచాయతీలో కార్యదర్శి విధులకు హాజరు కావడం లేదని గ్రామస్తులు శుక్రవారం జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో)కు వినతి పత్రం సమర్పించారు. అనంతరం పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శి పెరుమళ్ళ అంజయ్య ప్రతిరోజూ విధులకు హాజరు కాకుండా పది రోజులకు ఒకసారి మాత్రమే గ్రామానికి వస్తున్నారని ఆరోపించారు.
దీంతో పంచాయతీ కార్యాలయంలో జరగాల్సిన పనులు నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అతనిపై సంబంధిత అధికారులు విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదే విషయంపై ఎంపీడీఓకు కూడా వినతి పత్రం సమర్పించినట్లు పేర్కొన్నారు. వినతి పత్రం అందజేసిన వారిలో పలువురు గ్రామస్తులు ఉన్నారు.




