ప్రజా సమస్యలు పరిష్కరించాలని ఎంఎంసి కమిషనర్‌కు వినతి
ఘట్ కేసర్,(విజయక్రాంతి): ఘట్ కేసర్ సర్కిల్, పోచారం డివిజన్ పరిధిలోని శ్రీసాయి గణేష్ ఎన్‌క్లేవ్ లో ప్రజలు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక డ్రైనేజీ, రోడ్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ పోచారం డివిజన్ బీజేపీ అధ్యక్షులు ననావత్ సురేష్ నాయక్ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు సోమవారం మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి. వినయ్ కృష్ణరెడ్డి ని కలిసి వినతిపత్రం సమర్పించారు.
శ్రీసాయి గణేష్ ఎన్‌క్లేవ్‌లో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం వల్ల వర్షపు నీరు, మురుగునీరు నిలిచిపోతూ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. అలాగే కాలనీలోని అంతర్గత రహదారులు సరిగా లేకపోవడం వల్ల వర్షాకాలంలో బురద, నీటి నిల్వలు, రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని వివరించారు. ఈ సమస్యలపై ఇప్పటికే ఎంపీ ఈటల రాజేందర్ స్పందించి ఎంఎంసి కమిషనర్ కి డీ.ఓ. లేటర్ ద్వారా సరైన రోడ్లు, ప్రణాళికాబద్ధమైన డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాలని కోరిన సిఫార్సు లేఖను కూడా కమిషనర్ కి అందజేశారు.
కాలనీలో తక్షణమే క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించి, డ్రైనేజీ వ్యవస్థకు సాంకేతిక ప్రణాళిక రూపొందించి, అంతర్గత రోడ్ల నిర్మాణం, అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపట్టాలని బీజేపీ నాయకులు కోరారు. ఈకార్యక్రమంలో బీజేపీ పోచారం డివిజన్ జనరల్ సెక్రటరీ కోన మల్లేష్, రేతి వెంకటేష్, బీజేపీ నాయకులు వేణు మాధవ్, గంజి వంశీ కుమార్, రవి, బాలు, గణేష్ తదితరులు పాల్గొన్నారు.






