గిరిజన విద్యాభివృద్ధికి కృషి చేయాలి
ఏజెన్సీ డిప్యూటీ డీఈఓ గోడం చందన్
ఆసిఫాబాద్ (విజయక్రాంతి): కాగజ్‌నగర్ మండలంలోని పర్ధన్‌గూడా గిరిజన సంక్షేమ శాఖ ప్రాథమిక పాఠశాలలో ఏజెన్సీ డిప్యూటీ డీఈఓ గోడం చందన్ బుధవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థుల విద్యా ప్రమాణాలు, బోధనా విధానం, హాజరు శాతం, విద్యార్థుల అభ్యాస సామర్థ్యాలను పరిశీలించారు.విద్యార్థులతో ప్రత్యక్షంగా మాట్లాడిన ఆయన పలు అంశాలపై ప్రశ్నలు అడిగి వారి ప్రతిభను పరీక్షించారు. విద్యార్థులు చక్కగా సమాధానాలు ఇవ్వడంతో సంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాలలో అమలవుతున్న విద్యా కార్యక్రమాలు, బోధన పద్ధతులు, విద్యార్థుల నేర్చుకునే స్థాయిని పరిశీలించి ఉపాధ్యాయుల పనితీరును అభినందించారు.
ఈ సందర్భంగా గోడం చందన్ మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లోని విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. పర్ధన్‌గూడా పాఠశాలలో విద్యార్థులు చూపిన ప్రతిభ ప్రశంసనీయమని, వారికి మెరుగైన భవిష్యత్తు కోసం ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేయాలని సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తూ మంచి ఫలితాలు సాధిస్తున్న స్థానిక ఉపాధ్యాయురాలు జీవా కిరీటను ప్రత్యేకంగా అభినందించారు.పాఠశాలలో కొనసాగుతున్న విద్యా కార్యక్రమాలపై సంతృప్తి వ్యక్తం చేసిన ఆయన, విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.ఈ తనిఖీలో పీఎంఆర్సీ ఏసీఏంఓ పూర్కా ఉద్దవ్ పాల్గొన్నారు.






