ఫుట్‌పాత్ అక్రమ నిర్మాణాలు తొలగింపు
సికింద్రాబాద్, ఏప్రిల్ 18 (విజయక్రాంతి): హైదరాబాద్ మహానగరంలో పాదచారుల హక్కులను కాపాడేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు మరోసారి ఫుట్‌పాత్ అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపారు. సికింద్రాబాద్ పరిధిలో ఫుట్పాత్ ఆక్రమణల తొలగింపు ప్రక్రియ శనివారం వేగవంతమైంది. హైకోర్టు ఆదేశాల మేరకు జీహెచ్‌ఎంసీ అధికారులు భారీ పోలీస్ బందోబస్తుతో గాంధీ ఆసుపత్రి నుంచి ముషీరాబాద్ చౌరస్తా మీదుగా పద్మారావునగర్ పార్క్ వరకు రహదారుల ఇరువైపులా ఆక్రమణలను తొలగించారు.
గాంధీ ఆసుపత్రి పరిసరాల్లో రోగులు, పాదచారులు రోడ్డుపై నడవాల్సి వస్తుండటంతో ప్రమాదాలుపెరుగుతున్నాయని అధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతో రంగంలోకి దిగిన జీహెచ్‌ఎంసీ అధికారులు, సికింద్రాబాద్ జోన్ సిటీ ప్లానర్ సత్యభామ, కవాడిగూడ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ పుష్పలత ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ డ్రైవ్‌లో ఫుట్‌పాత్‌పై నిర్మించి ఆటంకం కలిగిస్తున్న తాత్కాలిక 70కి పైగా షెడ్లు, దుకాణాలు, నిర్మాణ సామగ్రిని జేసీబీల సహాయంతో పూర్తిగా కూల్చివేశారు. పాదచారులకు ఇబ్బంది లేకుండా ఫుట్‌పాత్‌లను ఖాళీ చేయడమే లక్ష్యమని అధికారులు తెలిపారు.
ఇదిలా ఉండగా ఈ చర్యలతో చిరువ్యాపారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ముందస్తు స్పష్టమైన ప్రత్యామ్నాయం చూపకుండా ఒక్కసారిగా దుకాణాలను కూల్చివేయడం వల్ల తమ బతుకు రోడ్డున పడిందని వాపోయారు. తొలగింపుల సమయంలో కొంత ఉద్రిక్తత నెలకొన్నప్పటికీ, పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ మాట్లాడుతూ, పాదచారులకు కేటాయించిన స్థలాన్ని వ్యాపారాల కోసం వాడుకోవడం నేరం. ఆక్రమణలను మళ్లీ ప్రోత్సహిస్తే భారీ జరిమానాలతో పాటు కఠిన చర్యలు తీసుకుంటాం అని హెచ్చరించారు.






