24 July, 2026 | 5:05 AM

వెంకటరమణకు 14 రోజుల రిమాండ్

24-07-2026 12:21 AM

చంచలగూడ జైలుకు రెడ్కో డీజీఎం

రంగారెడ్డి, జూలై 23 (విజయక్రాంతి): ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తెలంగాణ పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ (టీజీ రెడ్కో) డీజీఎం ముత్యం వెంకటరమణకు ఏసీబీ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. బుధవారం ఆయనను అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు, గురువారం కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఉత్తర్వుల అనంతరం అధికారులు ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించారు.

ఏసీబీ దాదాపు ఆరున్నర దశాబ్దాల (65 ఏళ్ల) చరిత్రలోనే అత్యంత భారీ స్థాయిలో అక్రమార్జన చేసిన ‘అతి ఖరీదైన అవినీతి తిమింగలాన్ని‘ పట్టుకోవడం ఇదే తొలిసారి. ఇటీవలే ఆర్ అండ్ బీ ఈఎన్సీ మోహన్ నాయక్ వద్ద రిజిస్ట్రేషన్ విలువే రూ.17.94 కోట్లు కలిగిన అక్రమాస్తులను ఏసీబీ గుర్తించి రికార్డు నమోదు చేయగా, వెంకటరమణ ఆ రికార్డును కూడా బద్దలు కొట్టారు.

ముత్యం వెంకటరమణ 2019లోనే ఒకరి వద్ద నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి ’రెడ్ హ్యాండెడ్’గా చిక్కారు. నాటి కేసు విచారణలో ఉండగానే ఆయన మళ్లీ భారీగా అక్రమాస్తులు కూడబెట్టడం గమనార్హం. మార్కెట్ విలువ ప్రకారం ఈ ఆస్తుల విలువ దాదాపు వందల కోట్ల వరకు ఉండవచ్చని ఏసీబీ ప్రాథమికంగా అంచనా వేస్తోంది.