calender_icon.png 13 February, 2026 | 10:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

36కు పైగా డివిజన్లలో ఎర్రజెండా రెపరెపలు ఖాయం

12-02-2026 12:00:00 AM

  1. కూనంనేని ధీమా కొత్తగూడెం కార్పొరేషన్‌పై   ఎగిరేది కంకి కొడవలే!
  2. అధికార గర్వాన్ని అణచివేసిన ఓటరు.. సీపీఐ అభ్యర్థుల గెలుపు తథ్యం
  3. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 11 (విజయక్రాంతి):  కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజా పక్షాన పోరాడుతున్న సిపిఐ అభ్యర్థుల విజయం ఖాయమని, 36కు పైగా డివిజన్లలో ఎర్రజెండా రెపరెపలాడబోతోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆశాభావం వ్యక్తం చేశారు. బుధవారం జరిగిన ఎన్నికల సరళిని ఆయన 60 డివిజన్ల వ్యాప్తంగా పర్యటించి స్వయంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ.. కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటర్లు ఎంతో చైతన్యవంతంగా పాల్గొన్నారని, సిపిఐ ఎన్నికల గుర్తు కంకి-కొడవలికి ప్రజల నుండి విశేష స్పందన లభించిందని తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల ఉత్సాహం చూస్తుంటే సిపిఐ అభ్యర్థుల మెజారిటీ స్పష్టంగా కనిపిస్తోందన్నారు. 

అధికార పక్షానికి బుద్ధి చెప్పిన ఓటరు

ఎన్నికల సమయంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని కొందరు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ, ఓటర్లను ప్రభావితం చేయాలని చూశారని కూనంనేని విమర్శించారు. అక్కడక్కడ పోలీసుల తీరు వల్ల చిన్నపాటి అసంతృప్తికర సంఘటనలు ఎదురైనప్పటికీ, ప్రజలు శాంతియుతంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని చెప్పారు. అధికార పక్ష ప్రలోభాలను కాదని, ప్రజా సమస్యలపై నిలబడే సిపిఐకే ఓటర్లు పట్టం కట్టారని ఆయన విశ్లేషించారు.

యంత్రాంగానికి అభినందనలు 

ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా సాగేలా కృషి చేసిన జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మరియు ఎస్పీ రోహిత్ రాజు గారికి కూనంనేని అభినందనలు తెలిపారు. రెండు రోజుల్లో జరగబోయే ఓట్ల లెక్కింపులో ప్రజల తీర్పు స్పష్టంగా వెల్లడవుతుందని, కొత్తగూడెం అభివృద్ధిలో సిపిఐ కీలక పాత్ర పోషించబోతోందని ఆయన స్పష్టం చేశారు.