calender_icon.png 21 February, 2026 | 10:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేశ ప్రయోజనాలు తాకట్టు… దురాగతాలను ఎండగట్టాలి

21-02-2026 08:21:43 PM

- సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు బండ శ్రీశైలం 

మునుగోడు,(విజయక్రాంతి): అమెరికా సామ్రాజ్యవాదానికి తలొగ్గి ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రయోజనాలు, ప్రతిష్టను తాకట్టు పెడుతున్నారని, ప్రజలు దీనిని వ్యతిరేకించి సామ్రాజ్యవాద దురాగతాలను ఎండగట్టాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు బండ శ్రీశైలం పిలుపునిచ్చారు. శనివారం మండల కేంద్రంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో రెడ్‌బుక్ డే సందర్భంగా సిపిఐ(ఎం) నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించి మాట్లాడారు. రెడ్‌బుక్ డే సందర్భంగా “బరితెగించిన అమెరికా సామ్రాజ్యవాదం” అంశంపై పార్టీ శ్రేణులు, ప్రజల్లో అధ్యయనం చేసి చర్చలు నిర్వహించాలని సూచించారు.

దేశంలో పెట్టుబడిదారీ విధానాలను ప్రోత్సహిస్తున్న బీజేపీ ప్రభుత్వం సామాన్య ప్రజలపై భారాలు మోపుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. సోవియట్ యూనియన్ పతనానంతరం ప్రజాస్వామ్యం విశ్వవ్యాప్తంగా విజయం సాధించిందని బూర్జువా ఉదారవాద రచయితలు ప్రకటించారని, కానీ ప్రస్తుత పరిస్థితులు వేరే దిశగా సాగుతున్నాయని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 21న నిర్వహించే రెడ్‌బుక్ డే దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న రాజకీయ–ఆర్థిక పరిణామాలపై అవగాహన పెంపొందించేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు.

దేశ విశాల ప్రయోజనాలను కాపాడేందుకు సామ్రాజ్యవాద వ్యతిరేక భావజాలాన్ని ప్రజల్లో బలంగా నెలకొల్పాలని, దేశభక్తి శక్తులన్నీ ఐక్యంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు నాంపల్లి చంద్రమౌళి, ఏర్పుల యాదయ్య, సాగర్ల మల్లేష్, జెర్రిపోతుల ధనంజయ, మిర్యాల భరత్, యాసరాణి శ్రీను, పగిళ్ల యాదయ్య, చీకూరి బిక్షం, బొల్లెపల్లి మల్లయ్య, గుయ్యని జంగయ్య తదితరులు ఉన్నారు.