ధాన్యం కొనుగోళ్లకు సన్నద్ధం
మహబూబాబాద్, ఏప్రిల్10 (విజయక్రాంతి): రబీ సీజన్లో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు అదనపు కలెక్టర్ అనిల్ కుమార్ తెలిపారు. 2025-26 రబీ సీజన్లో జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు కార్యక్రమాన్ని ఇలా యంత్రాంగం సజావుగా నిర్వహించిందని, కొనుగోలు కేంద్రాలను నిర్వహిస్తున్న ఏజెన్సీలకు 70 శాతం కమిషన్ చార్జీల కింద 4,96,75,172 రూపాయలను విడుదల చేసినట్లు అదనపు కలెక్టర్ తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో వరి కొనుగోళ్ల కోసం మొత్తం 204 పాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేశామని, అలాగే కొనుగోలు చేసిన ధాన్యం దిగుమతికి 59 రైస్ మిల్లులు జిల్లాలో అందుబాటులో ఉన్నాయన్నారు. వరి ధాన్యం కొనుగోళ్ల కోసం సుమారు 46 లక్షల కొత్త, పాత గన్నీ సంచులు సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. రబీ సీజన్లో జిల్లాలో సుమారు 3.62 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం మార్కెట్కు రానుందని అంచనా కాగా, అందులో సుమారు 2.60 లక్షల మెట్రిక్ టన్నులు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించబడిందన్నారు.
రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు కేంద్రాల్లో తాగునీరు, షెడ్, తాత్కాలిక మరుగుదొడ్లు, విద్యుత్ వంటి కనీస సౌకర్యాలు కల్పించాలని సంబంధిత ఏజెన్సీలకు సూచించారు. రైతులకు సకాలంలో చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో వరి కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా, సమర్థవంతంగా కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మేనేజర్ వి. నరసింహ రావు, డి ఆర్ డి ఏ మార్కెటింగ్ ఏపిఎం కిరణ్ రాయ్, సహకార శాఖ ఎం. భరత్ కుమార్, గిరిజన సహకార సంస్థ మేనేజర్ జే. దేవ్, మెప్మా అధికారి విజయ పాల్గొన్నారు.




