11 April, 2026 | 3:06 AM

మరమ్మతులు సవాలే!

11-04-2026 01:00 AM

ఉన్న సమయంలో కాళేశ్వరానికి రిపేరు కష్టమే?

వరదలొచ్చే లోపు పనులు పూర్తి కావడంపై అనుమానాలు

తాజాగా  సీఎం  సమీక్ష..  వేగంగా పూర్తి  చేయాలని  ఆదేశాలు

  1. రాష్ట్ర రైతాంగంలో ఒకవైపు ఆశలు.. మరోవైపు ఆందోళన
  2. పునరుద్ధరణకు నిర్మాణ సంస్థల స్పందనపై సందిగ్ధం
  3. కాళేశ్వరం నీళ్ల లేక 8 లక్షల ఎకరాల్లో సాగు ప్రశ్నార్థకం

హైదరాబాద్, ఏప్రిల్ 10 (విజయక్రాంతి): ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కాళేశ్వరం ప్రాజెక్టు గు రించి చర్చనీయాంశంగా మారింది. అయితే ప్రాజెక్టులోని బరాజ్‌ల కుంగుబాటు కారణంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో చుక్క నీరు కూడా ఎత్తిపోయని విషయం తెలిసిందే. తాజాగా సీఎం రేవం త్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతుల పురోగతిపై సమీక్షించిన నేపథ్యంలో ప్రాజెక్టు వినియోగంలోకి రావడంపై ఆసక్తి నెలకొంది.

కానీ రాబోయే రెండు, మూడు నెలల్లో వానాకాలం సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మరమ్మతులు గడువులో పూర్తవుతాయా అన్న ఉత్కంఠ రాష్ట్రవ్యాప్తంగా నెలకొంది. నిర్ణీత గడువులోగా మరమ్మతు పనులు పూర్తి కావడంపై సాగునీటి నిపుణులు సైతం అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇలాంటి కీలక సమయం లో ప్రాజెక్టు పనులను యుద్ధ ప్రాతిపదికన వేగవంతం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో రైతుల్లో కొత్త ఆశలు చిగురించాయి.

ఇదిలా ఉండగా మరోవైపు నిర్మాణ సంస్థలు పునరుద్ధరణ పనులకు ముం దుకు వస్తాయా అన్న సందిగ్ధత కూడా తెరపైకి వస్తుంది. గతంలో ఎదురైన సాంకేతిక లోపాలు, ఇప్పటికే కాళేశ్వరం నీళ్లు అందక లక్షల ఎకరాల సాగు అనిశ్చితిలో పడిన నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టు భవిష్యత్ కీలకంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న గడువులోగా, వరదలు రాకముందే ఈ మరమ్మతులు పూర్తుతైనే రైతులకు ఊరట, లేకపోతే వ్యవసాయ రంగానికి మరో పెద్దదెబ్బ తప్పదనే భావన మరింత బలపడుతోంది.

కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై సీఎం రేవంత్‌రెడ్డి తాజా సమీక్ష, పనులు వేగవంతం చేయాలన్న కఠిన ఆదేశాలతో రైతుల్లో మళ్లీ ఆశ లు చిగురిస్తున్నా యి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో లక్షల ఎకరాల సాగు పూర్తిగా ఈ ప్రాజెక్ట్‌పై ఆధారపడటంతో, మరమ్మతులు త్వరగా పూర్తుతై నీటి సరఫరా పునరుద్ధరించే నమ్మకం రైతాంగంలో కొంత ఊరటనిస్తోంది. గతంలో ఈ ప్రాజెక్ట్ ద్వారా సాగునీరు అందిన సమయంలో పంటల దిగుబడులు పెరిగిన అనుభవం రైతులకు ఉన్నందున ఈసారి కూడా అదే పరిస్థితి తిరిగి వస్తుందన్న ఆశ స్పష్టంగా కనిపిస్తోంది.

అయితే ఈ ఆశలతోపాటు ఆందోళ నకర పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. గతం లో మేడిగడ్డ వంటి కీలక భాగాల్లో తలెత్తిన సాం కేతిక లోపాలు, మరమ్మతుల్లో జరిగిన ఆలస్యం రైతుల విశ్వాసాన్ని దెబ్బతీశాయి. ఇప్పటికీ పూర్తిస్థాయి పునరుద్ధరణపై స్పష్టత లేకపోవడం, ప నుల పురోగతిపై అధికారికంగా వెల్లడయ్యే వివరాలు పరిమితంగా ఉండటం రైతుల్లో అనుమా నాలను పెంచుతోంది. ఈసారి నిజంగా గడువులో పూర్తవుతాయా? అనే ప్రశ్న గ్రామాల్లో చర్చనీయాంశంగా మారింది.

నిర్మాణ సంస్థల స్పందనపై సందేహం

కాళేశ్వరం ప్రాజెక్ట్ పునరుద్ధరణలో నిర్మాణ సంస్థల స్పందన అత్యంత కీలకంగా మారింది. భారీస్థాయిలో సాంకేతిక మరమ్మతులు, నిర్మాణపరమైన పనులు అవసరమవుతున్న నేపథ్యం లో సంస్థలు ముందుకు వస్తాయా అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా నిలిచింది. గతంలో ఎదురైన సాంకేతిక సమస్యలు, ప్రాజెక్ట్‌పై ఏర్పడిన ప్రతిష్ఠాత్మక ఒత్తిడి, ఆర్థిక లావాదేవీల అనిశ్చితి కలిసి కాంట్రాక్టర్లలో అభద్రతాభావం నెలకొంది.

ముఖ్యంగా మేడిగడ్డ వంటి కీలక నిర్మాణాల్లో లోపాలు బయటపడిన తర్వాత, మరమ్మతులు సాధారణ పనులు కాకుండా అత్యంత క్లిష్టమైన ఇంజినీరింగ్ సవాళ్లుగా మారాయి. ఇలాంటి పనులకు నైపుణ్యం ఉన్న సంస్థలు మాత్రమే ముందుకు రావాల్సి ఉండగా, వాటి సంఖ్య పరిమితంగా ఉండటం కూడా ఒక సమస్యగా మారింది. ఇక చెల్లింపుల విషయంలో అస్పష్టత, గ్యారంటీలు, అదనపు ఖర్చుల భారం ఎవరు భరిస్తారు? అన్న అంశాలు కూడా కీలకంగా మారాయి.

ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీలు, ప్రోత్సాహకాలు ప్రకటిస్తేనే సంస్థలు ముందుకు వచ్చే అవ కాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. లేకపోతే టెండర్ ప్రక్రియ ఆలస్యం కావడం, పనులు ప్రారంభం కావడంలో జాప్యం ఏర్పడే ప్రమాదం ఉంది. దీంతో కాళేశ్వరం పునరుద్ధరణలో సాంకేతిక అంశాలకంటే నిర్మాణ సంస్థల భాగస్వామ్యం ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది. 

సమయమే అతిపెద్ద సవాల్... 

కాళేశ్వరం ప్రాజెక్ట్ పునరుద్ధరణలో సమయమే ప్రస్తుతం అదిపెద్ద సవాల్‌గా మారింది. వరదల సీజన్ వేగంగా దగ్గరపడుతున్న నేపథ్యంలో, పరిమిత గడువులోనే విస్తృత స్థాయి మరమ్మతులు పూర్తి చేయాల్సిన పరిస్థితి అధికారుల ముందుంది. ఒకవైపు దెబ్బతిన్న బరాజ్‌లు, పంప్ హౌస్‌లో సాంకేతిక సమస్యలు, మరోవైపు క్లిష్టమైన ఇంజినీరింగ్ పనులు.. ఈ రెండింటినీ సమాంతరంగా పూర్తి చేయడం పెద్ద పరీక్షగా మారింది.

పనుల ప్రణాళిక, టెండర్లు, నిర్మాణ సంస్థల ఎంపిక, యంత్రాంగం సమీకరణ వంటి ప్రతి దశలో ఆలస్యం జరిగే అవకాశాలు ఉండటంతో గడువు మరింత కఠినంగా మారుతోంది. ముఖ్యంగా భారీస్థాయి నిర్మాణాల మరమ్మతులకు సాధారణంగా ఎక్కువ సమయం అవసరం ఉండగా, ఇప్పుడు మాత్రం కొద్ది నెలల్లోనే పూర్తి చేయాల్సిన ఒత్తిడి ఏర్పడింది. ఇక ముందస్తు వర్షాలు లేదా అనుకోని వరదలు వస్తే పనులకు అంతరాయం కలిగే ప్రమాదం ఉంది. మరోవైపు అధికారులు రోజువారీ మానిటరింగ్, ప్రత్యేక బృందాల ఏర్పాటు, నిపుణుల పర్యవేక్షణ వంటి చర్యలు గడువుపై ప్రభావం చూపనున్నాయి.

8 లక్షల ఎకరాల సాగు ప్రశ్నార్థకం

కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల కారణంగా సుమారు 8 లక్షల ఎకరాల సాగుభూమి భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. ఈ ప్రాజెక్ట్‌పై ఆధారపడిన ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పంటల సాగు పెద్దఎత్తున ప్రభావితమవుతోంది. నీటి సరఫరా నిలిచిపోవ డంతో రైతులు ఏ పంట వేయాలన్న దానిపై స్పష్టత లేక గందరగోళంలో పడుతున్నారు.

ఇప్పటికే రాబోయే సాగు సీజన్ దృష్ట్యా రైతులు ప్రణాళికలు సి ద్ధం చేసుకోవాల్సిన సమయంలో, నీటి లభ్యతపై స్పష్టత లేకపోవడం పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చింది. కొందరు రైతులు తక్కువ నీటితో పెరిగే పంటల వైపు మళ్లుతుండగా, మరికొందరు పూర్తి గా సాగును వాయిదా వేసే పరిస్థితి కనిపిస్తోంది. ఇది గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై ప్రత్యక్ష ప్రభావం చూపే అవకాశం ఉంది.