13 May, 2026 | 3:12 AM

అపోలో ఆసుపత్రిలో ఆరుదైన ఆపరేషన్

13-05-2026 01:01 AM
  1. చిన్నారికి కోత లేకుండానే లాలాజల గ్రంథి చికిత్స
  2. సూక్ష్మ ఎండోస్కోపీతో రాయి తొలగింపు 

హైదరాబాద్, మే 12(విజయక్రాంతి): దవడ కింద వాపు, భోజనం సమయంలో నొప్పితో బాధపడుతున్న ఆరేళ్ల చిన్నారికి జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రి వైద్యులు డాక్టర్ మనుసృత్, సీనియర్ కన్సల్టెంట్ ఈఎన్టీ శస్త్రచికిత్స నిపుణుడు అత్యాధునిక సియాలోఎండోస్కోపీ పద్ధతితో విజయవంతంగా చికిత్స అందించారు. లాలాజల నాళంలో రాయి ఏర్పడి గ్రంథి వాపు పునరావృతమవుతోందని వైద్యులు గుర్తించారు. సీనియర్ ఈఎన్టీ శస్త్రచికిత్స నిపుణుడు డాక్టర్ మనుసృత్ మాట్లాడుతూ, 1.3 మిల్లీమీటర్ల సూక్ష్మ ఎండోస్కోప్‌ను సహజ లాలాజల నాళం ద్వారా ప్రవేశపెట్టి ఎలాంటి బాహ్య కోత లేకుండా రాయిని తొలగించినట్లు తెలిపారు.

దీంతో గ్రంథిని పూర్తిగా కాపాడడంతో పాటు చిన్నారి త్వరగా కోలుకుని ఎలాంటి మచ్చలు లేకుండా సాధారణ జీవితానికి చేరుకుందని చెప్పారు. డాక్టర్ మనుసృత్ మాట్లాడుతూ సియాలో ఎండోస్కోపీ ద్వారా లాలాజల రాళ్లు, నాళాల ఇరుకుదనం, పునరావృత ఇన్ఫెక్షన్లు, ఆటోఇమ్యూన్ సంబంధిత సమస్యలు, రేడియో అయోడిన్ చికిత్స అనంతర ఇబ్బందులు, జువెనైల్ రికరెంట్ ప్యారోటిటిస్ వంటి సమస్యలను ఖచ్చితంగా గుర్తించి చికిత్స అందించవచ్చని తెలిపారు. గతంలో ఇలాంటి సమస్యలకు ఓపెన్ సర్జరీ లేదా గ్రంథి తొలగింపు అవసరమయ్యేదని, ఇప్పుడు ఈ ఆధునిక పద్ధతితో మచ్చలేని చికిత్స సాధ్య మవుతోందన్నారు. తెలుగు రాష్ట్రాల అపోలో ఆస్పత్రుల సీఈఓ 

తేజస్వి వీరేపల్లి మాట్లాడుతూ, ఈ విజయవంతమైన చికిత్సతో మినిమల్లీ ఇన్వేసివ్ సలైవరీ గ్లాండ్ ఎండోస్కోపీ సేవల ప్రాధాన్యం మరింత పెరిగిందన్నారు.