11 August, 2026 | 3:36 AM

రణరంగంగా రాంచీ

11-08-2026 01:14 AM
  1. పాత అసెంబ్లీ నుంచి విద్యార్థుల ర్యాలీ ప్రారంభం
  2. జేపీఎస్సీ, జేఎస్‌ఎస్సీ పరీక్షలు రద్దు చేయాలని నినాదాలు
  3. అక్రమాలపై సీబీఐ విచారణకు డిమాండ్
  4. ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసుల వాటర్ క్యానెన్ల ప్రయోగం
  5. అయినా.. వెనక్కి తగ్గని విద్యార్థులు
  6. కొత్త అసెంబ్లీ సమీపంలో ర్యాలీ అడ్డగింత.. పోలీసుల లాఠీచార్జ్
  7. బాష్పవాయువు గోళాలు ప్రయోగించిన పోలీసులు

రాంచీ, ఆగస్టు ౧౦: పోటీ పరీక్షల నిర్వహణలో అక్రమాలను నిలదీస్తూ, జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (జేపీఎస్సీ), జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిటీ (జేఎస్‌ఎస్సీ) ప్రక్షాళనను డిమాండ్ చేస్తూ సోమవారం జార్ఖండ్ రాజధాని రాంచీలో విద్యార్థుల చేపట్టిన ‘విధాన్ సభా ఘెరావ్ (అసెంబ్లీ ముట్టడి) ఉద్రిక్తతలకు దారి తీసింది. విద్యార్థి నేతల పిలుపు మేరకు రాష్ట్ర నలుమూలల నుంచి వేలాది మంది విద్యార్థులు రాజధానికి తరలివచ్చారు. విద్యార్థి ఉద్యమం నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం అసెంబ్లీ పరిసరాల్లో నిషేధాజ్ఞలు విధించి, 1,500 మంది పోలీసులను, భద్రతా సిబ్బందిని మోహరింపజేసింది. ఉదయం 10.30 గంటలకు పాత అసెంబ్లీ భవనం వద్ద ర్యాలీ ప్రారంభమైంది.

ఆందోళనకారులు జాతీయ జెండాలు చేబూని అక్కడి నుంచి ౨.౫ కిలోమీటర్ల దూరంలో ఉన్న కొత్త అసెంబ్లీ భవనం వైపు బయల్దేరారు. వరుసగా మూడు బ్యారికేడ్ల వరకు ఆందోళనకారులు చొచ్చుకుపోగలిగారు. అసెంబ్లీకి 200 మీటర్ల దూరంలో ఉన్న జగన్నాథ్‌పూర్‌లోని ౪వ బ్యారికేడ్ వద్ద పోలీసులు వారిని అడ్డుకోగా, ఉద్రిక్తత నెలకొంది. ఒకదశలో పరిస్థితి అదుపు తప్పి పోలీసులు, విద్యార్థులకు మధ్య తోపులాట జరిగింది. అది కాస్త లాఠీచార్జికి దారితీసింది. విద్యార్థులపై పోలీసులు వెంటనే వాటర్ క్యానన్స్ ప్రయోగించి వారిని కట్టడి చేయాలని ప్రయత్నించారు. లాఠీచార్జిలో పలువురు విద్యార్థులు గాయపడ్డారు. తోపులాటలో కొందరు పోలీసులు సైతం క్షతగాత్రులయ్యారు.

ఘర్షణ వాతావరణం నెలకొన్నప్పటికీ విద్యార్థులు ముందుకు సాగుతూనే ఉండగా, పోలీసులు వారిపై బాష్పవాయువు గోళాలను ప్రయోగించారు. విద్యార్థుల ర్యాలీకి ప్రతిపక్ష నేత బాబులాల్ మారండీతోపాటు పలువురు బీజేపీ నేతలు మద్దతు పలికారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థులపై లాఠీచార్జిపై ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ ‘ఎక్స్’ ద్వారా స్పందించారు. విద్యార్థులపై బలప్రయోగం చేయడం సరికాదని మండిపడ్డారు. మరోవైపు, లాఠీచార్జ్‌కు నిరసనగా మంగళవారం ‘అసెంబ్లీ ఘెరావ్’కు జార్ఖండ్ ఏబీవీపీ విభాగం పిలుపునిచ్చింది.

దేవేంద్ర స్ట్రెచర్‌పైనే ర్యాలీకి హాజరు..

తొమ్మిది రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న ఝార్ఖండ్ లోక్‌తాంత్రిక్ క్రాంతికారీ మోర్చా నేత దేవంద్రనాథ్ మహతో అంబులెన్స్‌లో వచ్చి, స్ట్రెచర్‌పైనే విద్యార్థులతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి శిబూ సోరెన్ చిత్రపటాన్ని చేతబూని ఆయన ర్యాలీకి హాజరయ్యారు. ముళ్ల కంచెలు తమను ఆపలేవని, రాష్ట్రప్రభుత్వం దిగివచ్చి తమ డిమాండ్లను నెరవేర్చే వరకు తమ ర్యాలీ, నిరాహార దీక్ష కొనసాగుతుందని తేల్చిచెప్పారు. ఆందోళనకారులపై పోలీసు చర్యలు తీసుకోవద్దని ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు విజ్ఞప్తి చేశారు. ఎలాంటి హింసకు తావు లేకుండా పోలీసులకు ఆజ్ఞలు జారీ చేయాలని కోరారు. 

జేపీఎస్సీ మాజీ చైర్మన్ అరెస్ట్

పోటీ పరీక్షల నిర్వహణపై ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో సీఐడీ అధికారులు సోమవారం జేపీఎస్సీ మాజీ చైర్మన్ ఎల్.ఖియాంగ్తేను అరెస్ట్ చేశారు. ఖియాంగ్తే ను ఇప్పటికే సీఐడీ నాలుగుసార్లు విచారించింది. రాంచీతోపాటు పలాము, హజారీబాగ్, బొకారో, ధన్‌బాద్ పరిధిలోని 18 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. మరోవైపు ఈ కేసులో ఇప్పటివరకు 14 మందిని విచారించింది. పరీక్షల అక్రమాలు, మనీలాండరింగ్ ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా కేసు నమోదు చేసింది.

అలాగే, జేపీఎస్సీ సభ్యులు అజీతా భట్టాచార్య, అనిమా హన్సా, జమాల్ అహ్మద్ తమ పదవులకు రాజీనామా చేశారు. విద్యార్థి ఉద్యమం తీవ్రతరం అవుతుండటంతో సర్కార్ జూలైలో నిర్వహించాల్సిన సివిల్ సర్వీసెస్ మెయిన్స్‌నూ వాయిదా వేసింది. విద్యార్థి ఉద్యమంపై రాష్ట్రప్రభుత్వం స్పందిస్తూ.. ఆందోళనకారుల డిమాండ్లలో 98 శాతం అంగీకరించామని స్పష్టం చేసింది. ౧౩ పోటీ పరీక్షలతోపాటు జేఎస్‌ఎస్సీ- సీజీఎల్ పరీక్షనూ రద్దు చేయాలనే డిమాండ్‌ను నెరవేర్చలేమని, కేవలం వాటిలో మూడు పరీక్షలను మాత్రమే రద్దు చేయగలమని ఉద్ఘాటించింది.

డిమాండ్లు ఇవి

14వ జేపీఎస్సీ సివిల్ సర్వీసెస్, జేఎస్‌ఎస్సీ-సీజీఎల్ సహా 13 రకాల రిక్రూట్‌మెంట్ పరీక్షలను తక్షణమే రద్దు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. పోటీ పరీక్షల నిర్వహణలో అవకతవకలపై సీఐడీ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టోరేట్ (ఈడీ) విచారణపై తమకు నమ్మకం లేదని, సీబీఐ లేదా ఇతర రాష్ట్రాల రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తులతో స్వతంత్ర విచారణ జరిపించాలని పట్టుబట్టారు. 13 పరీక్షల్లో కేవలం మూడు పరీక్షలు మాత్రమే రద్దు చేసేందుకు రాష్ట్రప్రభుత్వం అంగీకరించిందని, తమ డిమాండ్లకు ససేమిరా అనడం తమకు సమ్మతం కాదని తేల్చిచెప్పారు. శాంతియుతంగా ప్రదర్శన చేస్తున్న తమపై పోలీసులు లాఠీచార్జితో విరుచుకుపడ్డారని మండిపడ్డారు. ప్రభుత్వం తమ గళాన్ని అణచివేసేందుకు పోలీసులను ఉసిగొల్పుతున్నదని ఆరోపించారు.