నేడు రాంచీ విద్యార్థుల గర్జన
ప్రభుత్వంతో మూడోదఫా చర్చలూ విఫలం
అసెంబ్లీ ముట్టడికి పిలుపు
జేపీఎస్‌సీ ఉద్యమం, ముగ్గురు అధికారుల రాజీనామా
దేవేంద్రను పరామర్శించిన రచయిత పీయూష్ మిశ్రా
రాంచీ, ఆగస్టు 9: జార్ఖండ్ విద్యార్థుల ఆమరణ నిరాహార దీక్ష, మూడో విడుత చర్చల నేపథ్యంలో జేపీఎస్సీ పీటీని (జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టెస్ట్) రద్దు చేయడానికి ప్రభుత్వం అంగకరించినా, జేఎస్‌ఎస్సీ సీజీఎల్ (జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రాడ్యుయేట్ లెవెల్)పై ఒప్పందం కుదరలేదు. సిజిఎల్ కోర్టుల పర్యవేక్షణలో జరిగిన ఈ పరీక్షను ఏకపక్షంగా రద్దు చేయలేమని, ఇప్పటికే ఎంపికైన అభ్యర్థులు విధుల్లో చేరారని జార్ఖండ్ మంత్రి సుదివ్య కుమార్ సోను తెలిపారు.
నిరసనకారుల డిమాండ్లలో 98 శాతం ఆమోదించామని ప్రభుత్వం చెప్తున్నా, సీబీఐ విచారణ, సిజిఎల్ రద్దు విషయాల్లో రాజీ పడే ప్రసక్తే లేదని అభ్యర్థులు స్పష్టం చేశారు. దీంతో నేడు (సోమవారం) అసెంబ్లీని ముట్టడిస్తామని విద్యార్థి సంఘాలు ప్రకటించాయి. ఆదివారం విద్యార్థులకు, ప్రభుత్వానికి మధ్య మూడోవిడత చర్చలు జరిగాయి. గత రెండు విడతల్లాగే ఈ విడతలో కూడా విద్యార్థుల డిమాండ్లను ప్రభుత్వం పూర్తిగా అంగీకరించలేదు.
మరోవైపు జేపీఎస్సీ ముగ్గురు సభ్యులు అజిత్ భట్టాచార్య, జమీల్ అహ్మద్, అనిమా హన్స్‌దాలు గవర్నర్ సంతోష్ కుమార్ గంగ్వార్‌కు రాజీనామా లేఖలు సమర్పించారు. మరోపు ఆగస్ట్ 2 నుంచి జైపాల్ సింగ్ ముండా స్టేడియంలో ఆమరణ నిరాహార దీక్షలో ఉన్న మాజీ లోక్‌సభ సభ్యుడు, విద్యార్థి నాయకుడు దేవేంద్రనాథ్ మహతో ఆరోగ్యం ఆదివారం ఉదయం 3 గంటల ప్రాంతంలో క్షీణించినట్లు వైద్యబృందం అధికారి ఏపీ సిన్హా తెలిపారు. వెంటనే అక్కడే చికిత్స అందజేశామన్నారు.
ప్రభుత్వం ఆయనతో ఫోన్ ద్వారానే చర్చలు చేపట్టినా ఓ కొలిక్కి రాకపోవడంతో అసెంబ్లీ ముట్టడిని ప్రకటించారు. ఇంకోవైపు సీఎం హేమంత్ సోరెన్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. విద్యార్థులకు న్యాయం జరుగుతుందని చెప్పారు. తాము దొంగతనాన్ని పట్టుకున్నామని, వారికి కఠిన శిక్ష పడుతుందన్నారు. ఇక యువత తమ హక్కులను డిమాండ్ చేయాలని వాటిని నెరవేర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. విద్యార్థుల డిమాండ్లను వీలైనంత త్వరగా పరిష్కరించాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అధిర్ రంజన్ అన్నారు.
సీఎం హేమంత్ సోరెన్ చెప్పింది విద్యార్థులు విశ్వసించాలని, విద్యార్థుల జీవితాలపై తమకు ఆందోళన ఉందని గవర్నర్ గంగ్వార్ పేర్కొన్నారు. చర్చలతో ఈ సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. పిల్లల కన్నీళ్లకు హేమంత్ ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదని బీజేపీ అధ్యక్షుడు ఆదిత్య సాహు అన్నారు. దమ్ముంటే రాహుల్ గాంధీ ఈ ఉద్యమానికి మద్దతు ప్రకటించాలని, సీఎం ఇంటిముందు నిరసన తెలపాలని డిమాండ్ చేశారు. కాగా విద్యార్థుల ఉద్యమానికి ప్రముఖ నటుడు, గాయకుడు, రచయిత పీయూష్ మిశ్రా ఆదివారం మద్దతు ప్రకటించారు. విద్యార్థి నాయకుడు దేవేంద్ర మహాతోనూ పరామర్శించారు. అనంతరం నిరసనలో పాల్గొని పలు గీతాలను ఆలపించారు.






