18 May, 2026 | 2:25 AM

ఇంద్రేశంలో అక్రమ నిర్మాణాల జోరు!

18-05-2026 01:52 AM
  1. జి ప్లస్ టూ అనుమతులతో  ఐదారు అంతస్తుల నిర్మాణాలు
  2. టౌన్ ప్లానింగ్ అధికారుల మౌనం వెనుక ఏముంది..?
  3. సెట్బ్యాక్ నిబంధనలు గాలికొదిలిన బిల్డర్లు
  4. మున్సిపల్ అధికారులపై స్థానికుల ఆగ్రహం
  5. హెచ్‌ఎండిఏ అనుమతులపై అనుమానాలు
  6. హైడ్రా చర్యలు ఎప్పుడు..?

పటాన్‌చెరు, మే 17: పటాన్చెరువు నియోజకవర్గం ఇంద్రేశం మున్సిపాలిటీ ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు రోజురోజుకు పుట్టగొడుగుల్లా పెరుగుతున్నాయి. మున్సిపల్ అనుమతులు జి ప్లస్ టూ వరకు మాత్రమే అనుమతి ఉన్నప్పటికీ, కొందరు బిల్డర్లు ఇష్టారీతిగా 5, 6 అంతస్తుల వరకు భవనాలు నిర్మిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అంతేకాకుండా సెట్బ్యాక్లు వదలకుండా, సెల్లార్ నిబంధనలు పాటించకుండా, పార్కింగ్ సదుపాయాలు లేకుండా నిర్మాణాలు సాగుతున్నా సంబంధిత టౌన్ ప్లానింగ్ అధికారులు మాత్రం మౌనం పాటిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్థానికుల ప్రకారం, కొన్ని భవనాలకు హెచ్‌ఎండీఏ లేదా మున్సిపల్ అనుమతులు ఉన్నాయా లేదా అన్నది కూడా స్పష్టంగా తెలియడం లేదని చెబుతున్నారు. అనుమతులు లేకుండా లేదా అనుమతులకు విరుద్ధంగా నిర్మాణాలు జరుగుతున్నా అధికారులు ఎందుకు స్పందించడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

ప్రత్యేకంగా జి ప్లస్ టూ అనుమతులు తీసుకుని అదనంగా అంతస్తులు నిర్మించడం, సెట్బ్యాక్లు పూర్తిగా ఉల్లంఘించడం, సెల్లార్ను వాణిజ్య అవసరాలకు వినియోగించడం వంటి అంశాలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వం కఠిన వైఖరి అవలంబిస్తున్న నేపథ్యంలో, అనుమతులకు మించి నిర్మించిన అంతస్తులను గుర్తించి హైడ్రా, మున్సిపల్ అధికారులు కూల్చివేత చర్యలు చేపడతారని ఇప్పటికే హెచ్చరికలు జారీ అయ్యాయి.

అయినప్పటికీ ఇంద్రేశంలో మాత్రం నియంత్రణ లేకుండా నిర్మాణాలు కొనసాగుతుండటం వల్ల పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రజల ప్రాణ భద్రతను పణంగా పెట్టేలా సాగుతున్న ఈ నిర్మాణాలపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి పూర్తి స్థాయి విచారణ జరపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అక్రమాలకు సహకరిస్తున్న అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.