జోరుగా అక్రమ నిర్మాణాలు!
- ఓల్డ్ బోయినపల్లిలో అధికారుల అండదండలు
- నిబంధనలకు పాతరేస్తున్న భవన యజమానులు
- నిమ్మకు నీరెత్తినట్లు టౌన్ ప్లానింగ్ విభాగం!
- ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాలని స్థానికుల విజ్ఞప్తి
సికింద్రాబాద్, ఆగస్టు 22 (విజయక్రాంతి): ఓల్ బోయిన్పల్లి పరిధిలో అక్రమ నిర్మాణాల పర్వం యథేచ్ఛగా సాగుతోంది. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ నిబంధనలను బేఖాతరు చేస్తూ కొందరు భవన యజమానులు నిబంధనలకు విరుద్ధంగా భారీ అంతస్తులను నిర్మిస్తున్నారు.
ఈ అక్రమ కట్టడాలను అడ్డుకోవాల్సిన టౌన్ ప్లానింగ్ అధికారులు కనీసం అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శనివారం గచ్చిబౌలి పరిధిలో అక్రమంగా నిర్మించిన 6 అంతస్తుల భవనం కుప్పకూలిన నేపథ్యంలో ఉన్నతాధికారులు ఇటు వైపు దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు.
అధికారుల సహకారం..
ఓల్ బోయిన్పల్లి పరిధి పలు ప్రాంతాలలో శ్రీ సాయి ఎంకేవ్, హెచ్‌ఏఎల్ కాలనీ, ఆనంద్ నగర్, హాస్మత్ పేట్,గంగపుత్రకాలనీ, అంజయ్య నగర్, మల్లికార్జున కాలనీ, మణికంఠ కాలనీలలో అధికారుల అండదండలు, అక్రమ సంపాదన మోజుతోనే ఈ అక్రమ నిర్మాణాలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.
సెట్ బ్యాక్‌లు లేవు
పట్టణ ప్రణాళిక నిబంధనల ప్రకారం భవన నిర్మాణానికి అనుమతులు తీసుకున్న దాని కంటే అదనంగా మూడో, నాలుగో అంతస్తులు, పెంట్ హౌస్ నిర్మిస్తున్నారు. కనీస సెట్బ్యాక్లు, పార్కింగ్ స్థలాలు కేటాయించకుండా రోడ్లను ఆక్రమిస్తూ, నిబంధనల ప్రకారం జరగాల్సిన పనులను గాలికొదిలేసి రాత్రికి రాత్రే స్లాబులు వేస్తున్నారు. కాలనీల్లో ఇరుకైన రోడ్లు ఉన్నప్పటికీ భారీ బహుళ అంతస్తుల భవనాలు వెలుస్తుండటంతో భవిష్యత్తులో తీవ్ర ట్రాఫిక్, మురుగునీటి సమస్యలు ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అధికారుల చేతివాటం
అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని స్థానికులు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా క్షేత్రస్థాయి పరిశీలనకు అధికారులు రాక పోవడం వెనుక పెద్ద ఎత్తున ’చేతులు మారుతున్నాయన్న’ అనుమానాలు వ్యక్తమవుతు న్నాయి. నిర్మాణదారులు ఇచ్చే ముడుపులకు కక్కుర్తి పడి టౌన్ ప్లానింగ్ సిబ్బంది కంటితుడుపు చర్యలు తీసుకుంటున్నారు. ఫిర్యాదులు చేసినా నోటీసుల పేరుతో నాటకమాడుతూ కాలయాపన చేస్తున్నారనే స్థానిక నుంచి విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.
ముఖ్య సమస్యలు..
* మౌలిక సదుపాయాలపై భారం : పరిమితికి మించి అపార్ట్మెంట్లు, బహుళ అంతస్తుల నిర్మాణాలు చేపట్టడంతో విద్యుత్ లోడ్, డ్రైనేజీ ఓవర్ఫ్లో, మంచినీటి కొరత తీవ్రమవుతోంది.
* భద్రతా లోపాలు: ఎలాంటి నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా వేగంగా పనులు పూర్తి చేస్తుండటంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.
* ప్రభుత్వ ఆదాయానికి గండి : సరైన ఫీజులు, అనుమతులు తీసుకోకపోవడంతో జీహెచ్‌ఎంసీకి రావాల్సిన కోట్ల రూపాయల ఆదాయం పక్కదారి పడుతోంది.
ఉన్నతాధికారులు స్పందించాలి
ఓల్ బోయిన్పల్లిలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై ఉన్నతాధికారులు, విజిలెన్స్ విభాగం తక్షణమే క్షేత్రస్థాయి విచారణ చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అక్రమార్కులకు కొమ్ముకాస్తున్న స్థానిక టౌన్ ప్లానింగ్ అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు, నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన కట్టడాలను వెంటనే కూల్చివేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.






