శ్రీవారి సన్నిధిలో రాంచందర్‌రావు
పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన పలువురు ప్రముఖులు
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేక్ కట్ చేసిన పార్టీ శ్రేణులు
హైదరాబాద్, ఏప్రిల్ 27 (విజయక్రాంతి): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావు తన పుట్టినరోజు సందర్భంగా సోమవారం ఉదయం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారి సేవలో పాల్గొన్న ఆయన ప్రత్యేక పూజులు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయ పండితులు ఆయనకు ఆశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు అందజేశారు. తన పుట్టినరోజు వేళ రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, స్వామివారి ఆశీస్సులు అందరిపై ఉం డాలని ఆయన ఆకాంక్షించారు. రాంచందర్‌రావుకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఏపీ డిప్యూ టీ సీఎం పవన్ కల్యాణ్, బీజేపీ ఎంపీ డాక్టర్ కే లక్ష్మణ్ ఎక్స్ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాంచందర్‌రావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.
పుట్టినరోజును పురస్కరించుకొని పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పార్టీ శ్రేణులు సంబురాలు జరుపుకున్నారు. తిరుమల నుంచి తిరిగి వచ్చిన రాంచందర్‌రావును సోమవారం సాయంత్రం శంషాబాద్ విమానాశ్రయంలో రాష్ట్ర ముఖ్య నాయకులు, అధికార ప్రతినిధులు, నాయకులు, పార్టీ శ్రేణులు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి భారీ ర్యాలీగా చేరుకున్న ఆయనకు దారిపొడవునా శుభాకాంక్ష లు తెలపడంతోపాటు గజమాలతో స్వాగతం పలికారు.
అంతకుముందు ఉదయం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నాయకులు కేక్ కట్ చేశారు. తార్నాక ప్రాంతంలోని వెల్ఫే ర్ అసోసియేషన్ హాల్లో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరం, రక్తదాన శిబిరం పార్టీ శ్రేణుల సమన్వయంతో విజయవంతంగా జరిగింది. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్ గౌతంరావు, రాష్ట్ర కార్యదర్శులు శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి, మీడియా ఇంచార్జ్ ఎన్వీ సుభాష్ పాల్గొన్నారు.






