మంత్రి శ్రీధర్ బాబు చొరవతో రామగిరి ఇండస్ట్రియల్ పార్క్‌కు వేగం
250 ఎకరాల పారిశ్రామిక ప్రాంతాన్ని పరిశీలించిన అధికారులు – ఏర్పాట్లపై క్షేత్రస్థాయిలో సమీక్ష
మంథని,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలో పారిశ్రామిక అభివృద్ధికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. రత్నాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని మేడిపల్లి–రామగిరి ఖిల్లా ప్రాంతంలో ప్రతిపాదిత ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు మంత్రి శ్రీధర్ బాబు కృషి చేస్తున్న నేపథ్యంలో సోమవారం బహుళ పరిశ్రమల ప్రతినిధులతో కలిసి ఆయన ఈ ప్రాంతంలో పర్యటించనున్నారు.
ఈ పర్యటనకు ముందుగా ఆదివారం తహసీల్దార్ పర్నంది సుమన్, రత్నాపూర్ సర్పంచ్ పల్లె ప్రతిమ–పి. వీరరావు ఇండస్ట్రియల్ పార్క్ ప్రాంతాన్ని పరిశీలించి ఏర్పాట్లను సమీక్షించారు. రామగిరి ఖిల్లా ప్రాంతంలో సుమారు 250 ఎకరాల ప్రభుత్వ, పట్టా భూములను తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఆధ్వర్యంలో భూసేకరణ చేయగా, అక్కడ పలు పరిశ్రమల స్థాపనకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. మంత్రి శ్రీధర్ బాబు చొరవతో ఈ ప్రాంతానికి భారీ పరిశ్రమలను తీసుకురావాలనే లక్ష్యంతో ప్రముఖ పారిశ్రామిక సంస్థల ప్రతినిధులు స్థలాన్ని పరిశీలించనుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. పరిశ్రమల ఏర్పాటు ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు రామగిరి ప్రాంత అభివృద్ధికి కొత్త దిశ లభించనుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
మంత్రి పర్యటన విజయవంతం చేసేందుకు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఇప్పటికే ప్రాంతాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మంథని డీఎల్‌పీఓ మారుపట్ల కొమురయ్య, ఎంపీఓ మూల సమ్మిరెడ్డి, జోనల్ మేనేజర్ మహేశ్వర్, ఆర్‌ఐ కె. మహేష్, సెక్రటరీ గంగుల సంతోష్, జీపీఓ పేరుక వెంకటేశ్వర్లు, వార్డు సభ్యులు, స్థానిక నాయకులు కెక్కర్ల ఉష–అశోక్, బోగే సతీష్, పబ్బ మొగిలి, సందవేన కుమార్, కొండు అంజన్న, కొండు లక్ష్మణ్, కండె కిష్టయ్య, సోమారపు కనుకయ్య, బాద్రపు రంగయ్య, నగునూరి సతీష్, జక్కుల చందన్, బెజ్జాల రాములు, ఒర్రె సురేష్, తన్నీరు ప్రదీప్, పీట్ల శేఖర్ తదితరులు పాల్గొన్నారు.






