రాజీవ్ స్వగృహ.. అసాంఘిక కార్యక్రమాలకు అడ్డా
- సమస్యలు బోలెడు పట్టింపు లేదు ఎవరికి అధికారులకు విన్నవించిన
- పట్టించుకోవడం లేదు సమస్యలతో సహవాసం చేస్తున్న రాజీవ్ స్వగృహ లబ్ధిదారులు
- మురికి కంపుతో ఏగలేక పోతున్నాం, పట్టించుకోండి సార్లు
కామారెడ్డి, జూలై 23 (విజయక్రాంతి): రాజీవ్ స్వగృహ సముదాయం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారింది. లబ్ధిదారుల కంటే ఎక్కువగా అక్రమార్కులే రాజ్యమేలుతున్నారు. కనీస వసతులకు నోచుకోకుండా నిజమైన లబ్ధిదారులు అవస్థలు పడుతున్నారు. మరికొందరు ప్లాట్లను కబ్జా చేసి దొంగతనాలకు పాల్పడేవారు దర్జాగా ఎలాంటి ఆధారాలు లేకుండా నివాసముంటున్నారు. కనీస మౌలిక వసతులు లేకుండా కాలం వెల్లదీస్తున్నారు.
లబ్ధిదారులకు తోడుగా కొందరు అక్రమార్కులు అసాంఘిక కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. ఇదేమి పద్ధతి అని ప్రశ్నించే వారిని చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇది ఎక్కడో అనుకుంటే పొరపాటే. ఎస్పీ కార్యాలయానికి, జిల్లా కలెక్టర్ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే ఈ కాలనీ ఉంది. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని రాజీవ గృహకల్ప అధ్వాన్నంగా తయారు అయింది. 2007లో 17 బ్లాక్లుగా నిర్మాణ పనులు చేపట్టగా అందులో ఏడు బ్లాకులను మాత్రమే పూర్తి చేశారు.
ఒక్కో బ్లాకులో 32 కుటుంబాలు నివాసం ఉండేందుకు నిర్మాణం చేశారు. అయితే ఇందులో ఏడు బ్లాకులకు కలిపి మొత్తం 224 కుటుంబాలు నివాసం ఉండాల్సి ఉండగా ప్రస్తుతం కేవలం 11 కుటుంబాలు మాత్రమే నివాసం ఉంటున్నాయి. కానీ కొందరు దౌర్జన్యంగా ఎలాంటి ఆధారాలు లేకుండా నివాసం ఉంటున్నారు. అంతే కాకుండా కొందరు నకిలీ ధృవపత్రాలను సృష్టించి రాజీవ్ గృహకల్పలో నివాసం ఉంటున్నారు. ఇందులో కనీస సౌకర్యాలు అధికారులు కల్పించకపోవడంతో చాలామంది నివాసం ఉండేందుకు వెనుకంజ వేస్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని కొందరు ఇతరులకు సంబంధించిన గదుల్లో అక్రమార్కులు, అసాంఘిక శక్తులు, నివాసం ఉంటున్నారు.
అంతేకాకుండా తరువాత కలిగి అన్ని ధ్రువపత్రాలు కలిగిన వారు ఇది మా బ్లాకు అని వస్తే వారిపై దాడులకు పాల్పడుతున్నారు. రోడ్లపై తిరిగేవారు దౌర్జన్యంగా రాజీవ్ గృహకల్పలో నివాసము ఉంటున్నారు. అలాగే రాజీవ్ గృహకల్పలో ఆకతాయిలు మద్యం సేవిస్తూ అక్కడ ఉండే వారికి ఇబ్బందులు కలగజేస్తున్నారు. అంతేకాకుండా కొంతమంది దొంగతనాలకు పాల్పడుతూ అక్కడే నివాసం ఉంటున్నారు. మరికొంతమంది ఎంజాయ్ కోసం వస్తూ అక్కడే మద్యం సేవిస్తూ ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి వరకు అక్కడే గడుపుతున్నారు. మరి కొంతమంది ఆ సాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతూ అక్కడ ఉండేవారికి ఇబ్బందులు కలగ చేస్తున్నారు. దీంతో అన్ని అర్హతలు కలిగిన వారు నివాసముండేందుకు భయపడుతున్నారు.
మౌలిక వసతులు సున్నా
ఈ కాలనీలో కనీస మౌలిక వసతులు కూడా లేవు. మున్సిపల్ అధికారులకు, ప్రజావాణిలో కలెక్టర్కు ఎన్నోసార్లు తమ సమస్యలపై విన్నవించిన పట్టించుకోవడం లేదు అని కాలనీవాసులు తెలిపారు. అసాంఘిక శక్తులను, అక్రమాలకు పాల్పడుతున్న వారిని గుర్తించి, రాజీవ్ గృహకల్ప సర్టిఫికెట్ లేని వారిని కాలనీ నుంచి తరిమివేయాలని స్థానికులు కోరుతున్నారు. ఎలాంటి అర్హత లేకుండా కబ్జా చేసి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. మరికొందరు నేతల అండ చూసుకొని కొన్ని గదులకు నేతల అనుచరులు అద్దె సైతం వసూల్ చేస్తున్నారు. ఇప్పటికైనా కలెక్టర్, ఎస్పీలు స్పందించి రాజీవ్ స్వగృహ సముదాయాన్ని విజిట్ చేసి సమస్యలను గుర్తించి నెరవేర్చాలని అనర్హులను, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిని గుర్తించి కాలనీ నుంచి తొలగించాలని అసలైన లబ్ధిదారులు కోరుతున్నారు. కనీస మౌలిక వసతులను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
రాత్రిపూట అల్లరి చేస్తున్నారు
కామారెడ్డి రాజీవ్ స్వగృహలో అక్రమార్కులే ఎక్కువగా నివాసం ఉంటూ అల్లరి చేస్తున్నారు. రాత్రి అయిందంటే బెదిరింపులకు పాల్పడుతున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా స్పందించి చర్యలు తీసుకోవాలి.
- మాధవి, స్థానికురాలు, కామారెడ్డి
నకిలీ పత్రాలతో నివాసం ఉంటున్నారు..
రాజీవ్ స్వగృహ లో నకిలీ పత్రాలతో ఎక్కువ మంది నివాసం ఉంటున్నారు. అల్లరి చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. పోలీసులు స్పందించి అక్రమంగా నివాసం ఉంటున్న వారిని గుర్తించి వారిని బయటకు పంపించాలి. మున్సిపల్ అధికారునిర్మించి కాలువలను నిర్మించి కంపు లేకుండా చర్యలు చేపట్టాలి.
- పుష్ప, స్థానికురాలు, కామారెడ్డి






