రాజీవ్ గాంధీ సేవలు చిరస్మరణీయం జలగం ప్రవీణ్
తంగళ్ళపల్లి,మే 21 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలో దేశ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ నాయకులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జలగం ప్రవీణ్ టోనీ మాట్లాడుతూ దేశ ప్రజల కోసం అహర్నిశలు పనిచేసి ప్రాణత్యాగం చేసిన మహానేత రాజీవ్ గాంధీ అని కొనియాడారు.
దేశ యువతకు రాజకీయాల్లో భాగస్వామ్యం కల్పించేందుకు ఓటు హక్కు వయస్సును 21 నుంచి 18 సంవత్సరాలకు తగ్గించిన దూరదృష్టి నాయకుడు రాజీవ్ గాంధీ అని పేర్కొన్నారు. గ్రామీణ స్థాయిలో మహిళలకు అవకాశాలు కల్పించేందుకు స్థానిక సంస్థల్లో మహిళా రిజర్వేషన్లు తీసుకువచ్చి మహిళా సాధికారతకు బాటలు వేసిన నేతగా గుర్తు చేశారు. అలాగే దేశంలో సమాచార సాంకేతిక రంగ అభివృద్ధికి రాజీవ్ గాంధీ చేసిన కృషి అమోఘమని, ఆయన వేసిన ఐటీ పునాదుల వల్లే నేడు భారతీయులు ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో కీలక స్థానాల్లో కొనసాగుతున్నారని నాయకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






