రజనీకాంత్ ఆత్మకథ ముస్తాబు
సూపర్‌స్ట్టార్ రజనీకాంత్ తన జీవిత ప్రయాణాన్ని ఆత్మకథ రూపంలో తీసుకురానున్నారు. తన ప్రస్థానాన్ని అక్షరబద్ధం చేస్తున్నట్టు రజనీకాంత్ కుమార్తె, దర్శకురాలు సౌందర్య అధికారికంగా వెల్లడించారు. బెంగళూరులో ఒక సాదాసీదా బస్ కండక్టర్ స్థాయి నుంచి భారతీయ సినీ ఇండస్ట్రీలోనే అత్యంత ప్రభావవంతమైన గ్లోబల్ ఐకాన్‌గా ఎదిగిన ఆయన సుదీర్ఘ ప్రస్థానం ఈ పుస్తకంలో ఆవిష్కృతం కానుంది. గత కొన్ని రోజులుగా రజనీకాంత్ తన బయోగ్రఫీ రాస్తున్నారనే వార్తలు వస్తున్నాయి.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సౌందర్య దీనిపై పూర్తి స్పష్టతనిచ్చారు. “నాన్న స్వయంగా తన జీవితంలోని ప్రతి ముఖ్యమైన ఘట్టాన్ని, ఒడిదొడుకులను అక్షరబద్ధం చేస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక పుస్తక నిర్మాణ ప్రక్రియలో నేను కూడా అత్యంత సమీపంగా ఉంటూ భాగస్వామినయ్యాను. ఈ పుస్తకం ఎప్పుడు మార్కెట్లోకి వస్తుందా అని నేను కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నా. ఈ ఆత్మకథ కేవలం ఒక నటుడి సినీ ప్రయాణం మాత్రమే కాదు.
ఆధ్యాత్మిక చింతన, జీవిత పాఠాల సమాహారం. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందిన ‘ఒక యోగి ఆత్మకథ’ పుస్తకం పాఠకుల్లో ఎలాంటి వైబ్రేషన్స్ తెస్తుందో, నా తండ్రి ఆత్మకథ కూడా చదువరుల్లో అలాంటి అద్భుతమైన ప్రేరణను నింపుతుంది. పదే పదే చదువుకునే ఒక అరుదైన పుస్తకంలా నిలిచిపోతుంది. ఐదు దశాబ్దాలకు పైగా సాగిన రజనీకాంత్ ప్రస్థానంలో అభిమానులకు, ప్రపంచానికి తెలియని ఎన్నో ఆసక్తికరమైన నిజాలు, తెరవెనుక కష్టాలు, భావోద్వేగభరిత సన్నివేశాలను ఈ పుస్తకంలో పొందుపరుస్తున్నారు.
ప్రతి పాత్ర కోసం ఆయన పడ్డ శ్రమ, చూపిన క్రమశిక్షణ భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పుస్తకం విడుదలయ్యాక ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద సెన్సేషన్ సృష్టించడం ఖాయమని సౌందర్య జోస్యం చెప్పారు. అయితే, ఈ ఆత్మకథ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి కోలీవుడ్‌తోపాటు భారతీయ సినీ వర్గాల్లో రజనీకాంత్ బయోపిక్‌పై సరికొత్త చర్చ మొదలైంది. భవిష్యత్తులో ఈ పుస్తకం ఆధారంగా ఒక భారీ ఫీచర్ ఫిల్మ్ లేదా బయోపిక్ వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఒకవేళ తన తండ్రి జీవితాన్ని వెండితెరపై దర్శకురాలిగా ఆవిష్కరించే అవకాశం వస్తే, అది తన కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మక, ప్రత్యేకమైన చిత్రంగా నిలుస్తుందని సౌందర్య ఆశాభావం వ్యక్తం చేశారు. రజనీకాంత్ ప్రస్తుతం తన తదుపరి భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘జైలర్2’ షూటింగ్‌తోపాటు మరికొన్ని చిత్రాల చర్చల్లో బిజీగా గడుపుతున్నారు.






