24 June, 2026 | 2:36 AM

ముంచెత్తిన వాన

24-06-2026 01:18 AM
  1. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు
  2. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో బీభత్సం!
  3. నీటిలో మునిగిన అపార్ట్‌మెంట్ సెల్లార్లు 
  4. నీట మునిగిన కార్లు, బైక్‌లు
  5. ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన గ్రామాల్లో అంధకారం
  6. ములుగు జిల్లాలో పిడుగుపాటుకు ఇద్దరికి గాయాలు

ఆదిలాబాద్/ఉట్నూర్/బేల/ములుగు(మహబూబాబాద్), జూన్ 23 (విజయక్రాంతి)/అమీన్‌పూర్: రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో సోమవారం అర్ధరాత్రి, మంగళవారం భారీ వర్షాలు కురిశాయి. సంగారెడ్డి జిల్లా, ఆదిలాబాద్ జిల్లాలో జోరు వానలు కురిశాయి. ములుగు జిల్లాలో పిడుగుపాటుకు ఇద్దరికి గాయాలయ్యాయి. ఈదురుగాళ్లతో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి.

కొన్ని చోట్ల చెట్లు కూలిపోయాయి. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మున్సిపాలిటీ, బీరంగూడ పరిధిలో సోమవారం అర్ధరాత్రి కురిసిన కుండపోత వర్షానికి లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. అమీన్పూర్ మండలంలో 8.1 సెం.మీ., ఆర్సీ పురంలో అత్యధికంగా 11.4 సె.మీ.ల వర్షపాతం నమోదైంది.

అమీన్పూర్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీ, ఇక్రిశాట్ కాలనీ, దుర్గా ప్రొవిన్స్ కాలనీ, నరేంద్ర నగర్‌లోలోని లోతట్టు అపార్ట్‌మెంట్‌ల సెల్లార్లలోకి వరద నీరు భారీగా చేరింది. అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రజలు గాఢ నిద్రలో ఉన్న సమయంలో వరద పోటెత్తడంతో, పార్కింగ్‌లో నిలిపి ఉంచిన కార్లు, బైకులు పూర్తిగా నీట మునిగి తీవ్రంగా దెబ్బతిన్నాయి. జయలక్ష్మినగర్ హై టెన్షన్ ప్రధాన రహదారితో పాటు కీలక రోడ్లన్నీ మోకాళ్ల లోతు నీటితో నిండిపోయి చెరువులను తలపించాయి.

తెల్లవారుజామున వాహనదారులు, ఆఫీసులకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గాలివాన బీభత్సానికి డ్రైనేజీలు పొంగిపొర్లడంతో పాటు పలు ప్రాంతాలలో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. బాధిత కాలనీల్లో పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పర్యటించి దెబ్బతిన్న ఇళ్లను, మునిగిపోయిన సెల్లార్లను పరిశీలించారు.

రంగంలోకి దిగిన మున్సిపల్ అధికారులు, విపత్తు నిర్వహణ సిబ్బంది జేసీబీ యంత్రాల సహాయంతో సెల్లార్లలో చిక్కుకున్న కార్లను బయటకు తీశారు. భారీ మోటార్లను ఉపయోగించి నిలిచిన వర్షపు నీటిని బయటకు పంపించారు. ములుగు జిల్లా రామచంద్రపురం గ్రామ సమీపంలో మంగళవారం పిడుగు పడింది. పిడుగు పడిన ప్రదేశానికి సమీపంలో ఉన్న గొర్రెల కాపర్లు రాజు, కుమార్ గాయపడ్డారు. వీరిని ములుగు జిల్లా ఆస్పత్రికి తరలించారు. 

ఆదిలాబాద్ జిల్లాలో 

ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు డివిజన్‌లో మంగళవారం రాత్రి ఈదురుగాళ్లతో కురిసిన భారీ వర్షం కురిసింది. గుడిహత్నూర్ నుంచి ఉట్నూర్‌కు సరఫరా చేసే 33/11 కేవీ విద్యుత్ స్థంబాలపై చెట్ల కొమ్మలు పడిపోవడంతో విద్యుత్ స్తంభాలు నేలకొరిగి, తీగలు తెగిపోయాయి. ఉట్నూర్, ఇంద్రవెల్లి, సిరికొండ మండలాల పరిధిలోని గ్రామాల్లో దాదాపు 25 విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. బేల మండలంలో కురిసిన చిన్నపాటి వర్షానికే ఎకోరి మసాలా వెళ్లే ప్రధాన రహదారి బురదమయంగా మారింది. గుంతలమయం అయిన రహదారితో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.