21 July, 2026 | 10:25 PM

Breaking News

రైల్వే అండర్‌పాస్ బ్రిడ్జి ఏర్పాటు చేయాలి

21-07-2026 08:11 PM

సౌత్ సెంట్రల్ రైల్వే జీఎంతో మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్

మహబూబ్‌నగర్,(విజయక్రాంతి): పట్టణంలోని న్యూ మోతీనగర్, పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న రైల్వే సంబంధిత సమస్యలను వెంటనే పరిష్కరించాలని మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవను కోరారు. న్యూ మోతీనగర్‌లో 10 వేల మందికి పైగా ప్రజలు నివసిస్తున్నారని, అక్కడి నుంచి సద్దులగుండు, రాజేంద్రనగర్, ప్రేమ్‌నగర్ ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రజలు ఇప్పటికీ రైల్వే ట్రాక్ దాటాల్సిన పరిస్థితి ఉందన్నారు. ఈ కారణంగా అనేక మంది ప్రమాదాలకు గురై కాళ్ళు, చేతులు అవయవాలు కోల్పోయిన సంఘటనలు చోటుచేసుకున్నాయని, అత్యవసర సమయాల్లో అంబులెన్స్‌ల రాకపోకలు కూడా తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నాయని వివరించారు. ప్రజల ప్రాణ భద్రత దృష్ట్యా న్యూ మోతీనగర్ వద్ద అత్యవసరంగా నూతన రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మించాలని కోరారు.  న్యూ మోతీనగర్ నుంచి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI) గోదాం వరకు శాశ్వత రహదారి నిర్మాణానికి రైల్వే శాఖ అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రైల్వే అనుమతి లభించిన వెంటనే మున్సిపాలిటీ ద్వారా, స్వంతంగా రహదారిని ఏర్పాటుచేసుకుంటామని అన్నారు.